ఎన్నికల కౌంటింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో కూటమి పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాల విషయంలో ఇప్పటి వరకు మూడు పార్టీల నేతలు మౌనం వహించారు. ప్రధాని మోడీ నామినేషన్ వేసిన రోజు మాత్రమే వారణాసిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. మూడు రోజుల క్రితమే హైదరాబాద్‌కు వచ్చారు. ఆ తర్వాత శనివారం రాత్రి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఫలితాల విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్ధులతో ఆయా పార్టీల నేతలంతా కలిసి జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజు అభ్యర్ధులతో పాటు ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్ధేశం చేసారు. ఇక ఏపీలో ఎన్డీయే కూటమి 21 ఎంపీ సీట్లు గెలవబోతుందని ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిందని.. రాష్ట్రంలో కూడా 53 శాతం ఓట్లతో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ చెప్పారు. అటు చంద్రబాబు సైతం కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అభ్యర్ధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు పలు సూచనలు చేసారు. కూటమి విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశ్యంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేశారు. ఓటమి భయంతో కౌంటింగ్‌పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు చంద్రబాబు. తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని ఇప్పటికే అధికార పార్టీ మొదలు పెట్టిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారన్న చంద్రబాబు.. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు.
కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలని.. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పని చేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల నుండి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యహరించాలన్నారు. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించొద్దని సూచనలు చేశారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు. ఆర్వో వద్ద డిక్లరేషన్ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుండి బటయకు రావాలన్నారు. లెక్కింపులో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ అడిగాలని సూచించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ.. కౌంటింగ్ సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందని, ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..