Andhra Pradesh: నేడూ వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం గోదావరి గట్టు పరిశీలన
గోదావరి (Godavari) వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం (ఇవాళ) కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండో రోజు పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లి, వారి సమస్యలను....
గోదావరి (Godavari) వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం (ఇవాళ) కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండో రోజు పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. నిన్న రాత్రి పాలకొల్లులో బస చేసిన చంద్రబాబు (Chandrababu).. శుక్రవారం ఉదయం 10 గంటలకు యలమంచిలి మండలం దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగాధర పాలెం, లక్ష్మీపురం ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం నరసాపురం మండలం పొన్నపల్లిలో గోదావరి గట్టును పరిశీలించి, సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం (Rajamahendravaram) ఎయిర్ పోర్టుకు వెళ్లి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. కాగా చంద్రబాబు గురువారం పర్యటనలో సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను బురదలో వదిలేసి ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం బాధితులకు రూ.10వేల చొప్పున ఇస్తోందన్న చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.2 వేలు అందిస్తోందని చెప్పారు. బాధితులను పరామర్శించి, ప్రభుత్వ సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.
కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశృతి జరిగింది. రాజోలు మండలం సోంపల్లి రేవులో లాంచీ దిగుతుండగా నీటిలో అకస్మాత్తుగా అందరూ పడిపోయారు. ప్రమాద సమయంలో లాంచీలో చంద్రబాబు సహా 15 మంది ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు సహా అందరూ నీటిలో తడిసి ముద్దయ్యారు. మానేపల్లి వరదల సమయంలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై తక్షణమే స్పందించిన మత్స్యకారులు టీడీపీ నేతలను నదిలో నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి