జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమనీ, అందుకే వరి వేసిన రైతు మెడకు ఉరేసుకునే పరిస్థితి వచ్చిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానిది నిర్లక్ష్య వైఖరంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా సమయంలో దేశానికి అన్నం పెట్టిన ఘనత రైతులకే దక్కుతుందని.. అలాంటి రైతులు అకాల వర్షాలతో నష్టపోతుంటే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఉంగుటూరు మండలం నాచుగుంటలో దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు చంద్రబాబు. రైతులతో మాట్లాడి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో రైతులు నిండా మునిగిపోతోంటే… గతంలో తాను శంకుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్ పోర్ట్ ను తిరిగి శంకుస్థాపన చేసేందుకు సీఎం జగన్ వెళ్లారని చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రినీ, వ్యవసాయ శాఖ మంత్రినీ ఎమ్మెల్యేలనూ ప్రజలు తరిమి కొట్టకముందే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. చివరి బస్తా కొనేవరకూ రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి అండగా మేముంటామన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతన్నకి న్యాయం చేయిస్తామన్నారు చంద్రబాబు.
రైతులను వర్షాలపై అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు చంద్రబాబు. రైతాంగంతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదన్నారు చంద్రబాబు. ఓట్లు వేయించుకున్నవారిని ఇప్పుడు ప్రశ్నించాల్సిన సమయమొచ్చిందన్నారు.
రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సరికాదని ఏ ఒక్క రైతుకీ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందంటూ ఏపీ వ్యవసాయాధికారులు ప్రకటన చేశారు. పంట నష్టంపై సర్వే చేసేందుకు వర్షాలు అడ్డంకిగా ఉన్నాయన్నారు. అకాల వర్షాలు 8 వతారీకు వరకు ఉండడంతో వర్షాలు తగ్గిన15 రోజుల అనంతరం నివేదిక తెస్తామన్నారు. ఏ ఒక్కరైతుకీ ఇబ్బంది కలగకుండా. ఖరీఫ్ మొదలయ్యే ముందే మార్చి, ఏప్రిల్, మే వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం ఇస్తామని వివరణ ఇచ్చారు వ్యవసాయాధికారులు. నిబంధనల మేరకు రైతులకు నష్టపరిహారం అందిస్తామని, రైతులకు ఏదైనా ఇబ్బంది ఉంటే.. వ్యవసాయశాఖ టోల్ ఫ్రీ నంబర్ 155251కి కాల్ చేయవచ్చునని తెలిపారు.
రైతులకు నష్టం జరగకుండా మద్దతుధర కోల్పోకుండా చూడాలని సీఎం ఆదేశించారన్నారు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్. ఇప్పటివరకూ రబీ సీజన్ లో 5.22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసామన్నారు. రబీ సీజన్ లో 30 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించామని, అయితే అంతకు మించి వచ్చినా కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు. తడిచిన ధాన్యాన్ని సైతం మద్దతుధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇక రైతులను మోసం చేసే మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..