AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధర్మవరం ఎమ్మెల్యే వర్సెస్ TDP యువరాజు.. గుడ్‌మార్నింగ్ ధర్మవరం సీక్రెట్ ఇదేనంటూ లోకేష్ ఎటాక్

ధర్మవరం యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి తెరతీస్తోంది. కేతిరెడ్డి అవినీతి చిట్టాను బయటకు తీస్తామన్నారు టీడీపీ నేతలు.

ధర్మవరం ఎమ్మెల్యే వర్సెస్ TDP యువరాజు.. గుడ్‌మార్నింగ్ ధర్మవరం సీక్రెట్ ఇదేనంటూ లోకేష్ ఎటాక్
Kethireddy And Nara Lokesh
Sanjay Kasula
|

Updated on: Apr 04, 2023 | 4:41 PM

Share

కేతిరెడ్డి వారి అందాల దీవి… చంద్రబాబు కట్టుకున్న మినీ ఎస్టేట్ బిల్డింగ్… మధ్యలో ఒక సెల్ఫీ ఛాలెంజ్. తెలుగునాట ఇదొక రససమ్యమైన రాజకీయ విన్యాసం. యువగళం పాదయాత్రలో భాగంగా ధర్మవరం వచ్చిన నారా లోకేష్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎర్రగుట్టను ఆక్రమించాడని ఆరోపణలు చేశారు. గుట్ట పైన ఉన్న 20 ఎకరాలను కబ్జా చేశారని ఆధారాలు కూడా బయటపెడతామని పేర్కొన్నారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అమరావతి వద్దనున్న చంద్రబాబు నివాసానికి వెళ్లి సవాల్ చేశారు. లోకేష్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పలు ఆధారాలను బయట పెట్టారు. సోమవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్ చేస్తూ ఎర్రగుట్ట మీద ఉన్న భూముల్ని రైతుల నుంచి కొన్నానని పేర్కొన్నారు.

అయితే రికార్డుల ప్రకారం.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. కేతిరెడ్డి తమ్ముడు భార్య గాలి వసుమతి పేరుతో కొన్నది కేవలం 25.38 ఎకరాలు మాత్రమే. అయితే గుట్టపైన మొత్తం 45 ఎకరాలు ఆక్రమణలో ఉందన్నారు. మిగిలిన 20 ఎకరాలు మొత్తం కబ్జా చేశారు. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కేతిరెడ్డి ల్యాండ్ ను కొలవగా 45.47 ఎకరాలుగా చూపిస్తోంది. మిగిలిన 20 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. దమ్ముంటే అందరి సమక్షంలో ఎర్రగుట్టపై ఉన్న భూమిని కొలిపించే దమ్ము కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు లోకేష్.

ఎర్రగుట్టపై సర్వే నంబర్లు 904, 905, 908, 909 లో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో రైతుల నుంచి భూములు కొన్నట్టు రికార్డులో ఉంది. మొత్తం రైతుల నుంచి 25.38 ఎకరాలు కొన్నట్టు రికార్డుల్లో ఉంది. అయితే ఇందులో 8 ఎకరాలు పిత్రార్జితంగా వచ్చినట్లు రికార్డులో ఉంది. కర్నూలుకు చెందిన గాలి వసుమతికి ఇక్కడ వంశపారపరంగా భూములు ఎలా సంక్రమించాయి. ఇది ఒక కోణం అయితే… మొత్తం రికార్డుల ప్రకారం కేతిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసింది కేవలం 25.38 ఎకరాలు మాత్రమే.

అయితే ఎర్రగుట్టపై మొత్తం 45.47 ఎకరాలు ఆక్రమించుకొని విలాసమంతమైన ఫామ్ హౌస్, తోటలు, బోటింగ్ లాంటివి ఏర్పాటు చేసుకున్నాడు. కేతిరెడ్డి అక్రమాన్ని గూగుల్ మ్యాప్ పట్టించింది. గూగుల్ మ్యాప్ ద్వారా కేతిరెడ్డి స్వాధీనంలో ఉన్న భూమిని కొలువగా 45.47 ఎకరాలు చూపిస్తోంది. రికార్డుల్లో 25.38 ఎకరాలు మాత్రమే ఉంది. మిగిలిన 20 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఏం సమాధానం చెప్తావు కేతిరెడ్డి? అధికారులు అబద్ధం చెప్పిన గూగుల్ అబద్ధం చెప్పదని అంటున్నారు నారా లోకేష్.

మరోవైపు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌. 25 ఎకరాలు కొన్నా అంటున్న ఎమ్మెల్యే విలాసవంతమైన గెస్ట్‌హౌస్‌లో ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. పది ఎకరాలతో మొదలై ఇప్పుడు 100 నుంచి 150 ఎకరాల భూములు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌ కాదు.. పెద్దగా వ్యాపారం లేదు.. ఏ పనీ లేదు అలాంటి వ్యక్తి వందల ఎకరాలు, ఆస్తులు ఎలా సంపాదించారన్నారని ప్రశ్నించారు. మరదలు, తమ్ముడి పేరుతో ఆస్తులు పెట్టారన్నారని ఆరోపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం