AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: టీడీపీలో సీనియర్లకు బాబు ఝలక్.. బడా నేతలకు హ్యాండ్

గుంటూరు జిల్లాలో సీనియర్ నేత అయిన ఆలపాటి రాజాకు ఈసారి టికెట్ దక్కలేదు. పొత్తుల్లో భాగంగా ఆయన ఆశించిన తెనాలి స్థానం జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నారు. తెనాలి సీటు కోసం ఎంతగానో ప్రయత్నించిన ఆలపాటి.. తొలిజాబితాలోనే ఈ సీటు నాదెండ్లకు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. అయితే చంద్రబాబు సర్దిచెప్పడంతో.. టీడీపీ గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించి సైలెంట్ అయ్యారు.

TDP: టీడీపీలో సీనియర్లకు బాబు ఝలక్.. బడా నేతలకు హ్యాండ్
Chandrababu Naidu
Ram Naramaneni
|

Updated on: Mar 15, 2024 | 1:48 PM

Share

కాలం కలిసిరాకపోతే ఎవరైనా సైలెంట్ అయిపోవాల్సిందే. ఒకప్పుడు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా.. ఇప్పుడు మాత్రం లిస్టులో తమ పేరు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. గతంలో ఓ వెలుగు వెలిగి.. తమ జిల్లాల్లో పెద్ద బాధ్యతలు చూసిన వాళ్లు సైతం.. ఇప్పుడు తమ టికెట్ సంగతేంటి అని వర్రీ అయిపోతున్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో అని అనుకుంటూ కాలం గడుపుతున్నారు. ఎన్నికల రణక్షేత్రం కోసం రెడీ అవుతున్న టీడీపీలోని మాజీమంత్రుల గందరగోళ పరిస్థితి ఇది. కొందరికి పొత్తులు శాపంగా మారితే.. సర్వేలు సానుకూలంగా లేవంటూ కొందరికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత అయిన కళా వెంకట్రావు సీటు ఈసారి డైలమాలో ఉంది. టీడీపీలో సీనియర్, చంద్రబాబుకు సన్నిహితుల్లో ఒకరైన ఆయన సీటు పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అంతుబట్టని పరిస్థితి. 2014లో ఎచ్చెర్ల నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. 2019లో మాత్రం చాలామంది సీనియర్ల తరహాలోనే ఓటమి చవిచూశారు. ఈసారి ఆయనకు సీటు ఉంటుందా ? లేదా ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. రెండు జాబితాల్లోనూ ఎచ్చెర్ల సీటు ప్రకటించలేదు టీడీపీ. దీంతో ఆయన స్థానం ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ఎప్పటికప్పుడు సీటు మారి విజయాన్ని దక్కించుకునే గంటా శ్రీనివాసరావుది ఈసారి వింత పరిస్థితి. ఆయన ఈసారి భీమిలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ టీడీపీ నాయకత్వం మాత్రం ఆయన ముందు కొత్త ప్రపోజల్ పెట్టింది. విజయనగరం జిల్లాలోని మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు సూచించారు చంద్రబాబు. అయితే ఇందుకు గంటా సానుకూలంగా లేరు. దీంతో చివరకు గంటా పరిస్థితి ఏమవుతుంది ? ఆయన కోరుకున్న సీటు దక్కుతుందా ? లేక అధిష్టానం ఆదేశాలకు తగ్గట్టుగా ఆయన చలో చీపురుపల్లి అంటారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కొవ్వూరు నుంచి టికెట్ ఆశించిన మాజీమంత్రి జవహర్‌కు సెకండ్ లిస్ట్‌లో షాక్ ఇచ్చింది పార్టీ నాయకత్వం. ఆయన స్థానంలో ముప్పిడి వెంకటేశ్వరరావు అవకాశం కల్పించింది. అయితే దీనిపై జవహర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం కరెక్ట్‌ కాదంటున్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావుది కలుపుకుని వెళ్లే మనస్తత్వం కాదని… ఎప్పటిలాగే ఒంటరిగానే వెళ్తారు, ఓటమి పాలవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జవహర్.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని మాజీమంత్రి పీతల సుజాతకు టీడీపీ నాయకత్వం తొలి జాబితాలో షాక్ ఇచ్చింది. ఇక్కడి నుంచి ఆమెకు కాకుండా రోషన్ కుమార్‌కు ఛాన్స్ ఇచ్చింది. అయితే టీడీపీ నాయకత్వానికి ఇప్పటికి కూడా పీతల సుజాత విధేయురాలిగానే కొనసాగుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మాజీమంత్రి దేవినేని ఉమ సీటు త్రిశంకు స్వర్గంలో పడిపోయింది. ఆయన గతంలో మైలవరం నుంచి పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు. కొద్దిరోజుల క్రితం వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. మైలవరం టికెట్‌పై టీడీపీ హామీ ఇవ్వడం వల్లే కృష్ణప్రసాద్ టీడీపీలో వచ్చారనే చర్చ జరుగుతోంది. అయితే సీటు తనకే కావాలని దేవినేని ఉమా పట్టుబడుతున్నారు. దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్‌తో పాటు బొమ్మసాని సుబ్బారావు కూడా సీటు కోసం పోటీ పడుతుండటంతో.. మైలవరం సీటు కోసం ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. దీంతో చివరి నిమిషం వరకు ఈ సీటు సంగతి తేలేలా కనిపించడం లేదు. ఒకవేళ మైలవరం సీటు దేవినేనికి దక్కకపోతే.. ఆయనకు టీడీపీ నాయకత్వం మరో స్థానం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఇస్తుందా ? లేక మరో రకంగా అవకాశం ఇస్తామని బుజ్జగిస్తుందా ? అన్నది చూడాలి.

గుంటూరు జిల్లాలో సీనియర్ నేత అయిన ఆలపాటి రాజాకు ఈసారి టికెట్ దక్కలేదు. పొత్తుల్లో భాగంగా ఆయన ఆశించిన తెనాలి స్థానం జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నారు. తెనాలి సీటు కోసం ఎంతగానో ప్రయత్నించిన ఆలపాటి.. తొలిజాబితాలోనే ఈ సీటు నాదెండ్లకు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. అయితే చంద్రబాబు సర్దిచెప్పడంతో.. టీడీపీ గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించి సైలెంట్ అయ్యారు. నెల్లూరు జిల్లాలోని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిస్థితి కూడా డైలమాలో ఉంది. సోమిరెడ్డి పోటీ చేయాలనుకుంటున్న సర్వేపల్లి స్థానంపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవానికి కొన్నాళ్లుగా వరుస ఓటములను ఎదుర్కొంటున్నారు సోమిరెడ్డి. అయినా ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను 2014-2019 మధ్య మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. అయినా సోమిరెడ్డి ఫెయిల్యూర్ జర్నీ ఆగలేదు. 2019లోనూ ఆయన తన ప్రత్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి కాకాణిపై ఏదో రకంగా పోరాటం చేస్తున్నారు సోమిరెడ్డి. కానీ టీడీపీ అధిష్టానం ఆయన టిక్కెట్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగింది.

ఈ మాజీమంత్రుల్లో కొందరికి టికెట్ లేదని తేల్చేసిన టీడీపీ నాయకత్వం.. మరికొందరి సీట్ల విషయంలో మాత్రం ఇంకా నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. అయితే చివరివరకు వీరికి సీటు తేల్చలేదంటే.. ఒకప్పుడు వెలుగు వెలిగిన మాజీమంత్రులకు మళ్లీ టికెట్ కష్టమే అనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..