పలాస. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది జీడిపప్పు.. ఎవరైనా శ్రీకాకుళం జిల్లాకు వెళ్తున్నామంటే చాలు వచ్చేటప్పుడు జీడిపప్పు తీసుకురండి అని చెబుతూ ఉంటారు. ఎంతో టేస్టీగా ఉంటూ తెల్ల బంగారం హోదా పొందిన పలాస జీడి పప్పు అంటే అంత క్రేజ్ మరి. కొన్ని దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ జంట పట్టణ కేంద్రాలుగా రెండు వందలకు పైగా జీడి పప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. వీటి కారణంగా వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లాలోని ఇటు ఏజెన్సీ.. అటు ఉద్ధానం ప్రాంత రైతులు సైతం జీడితోటల సాగు మీదే ఆధారపడి బతుకుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో లక్షల ఎకరకాలకు పైగబడి జీడి తోటల సాగు కొనసాగుతున్నది. ఇంత ప్రాధాన్యమున్న జీడిపప్పు పరిశ్రమలు ఇటీవల కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. తమకు గిట్టుబాటు ధర దొరకటం లేదని ఓ వైపు రైతులు, తమకు చాలీచాలని వేతనాలు ఇస్తున్నారని జీడీపప్పు పరిశ్రమ కార్మికులు.. కొన్ని ఏళ్లుగా ప్రతి ఏటా ఆయా సీజన్‌లో ఆందోళన బాట పడుతుంటారు. ఇప్పుడీ ఆందోళన బాటలో పరిశ్రమ యాజమాన్యాలు కూడా పయనిస్తున్నాయి. మా కష్టాలు మాకున్నాయంటూ.. వాటిని తీర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు రెండు వారాల పాటు పరిశ్రమలను మూసేశాయి. జీడిపప్పు ఉత్పత్తి అవుతున్నా.. ఆ మేరకు మార్కెట్లో అమ్మకాలు జరగడం లేదని అందుకే పరిశ్రమలను మూసేస్తున్నానమని ప్రకటిస్తున్నాయి వాటి యాజమాన్యాలు.
జీడి పరిశ్రమలు మూతపడటంతో ఆయా పరిశ్రమలలో పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారు. జూలై 22 నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా పరిశ్రమలను తెరిచేది లేదంటున్నాయి యాజమాన్యాలు.. అలా అయితే కుదరదని, కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని జూలై 29 కల్లా ఎట్టి పరిస్థితిల్లోనూ తెరవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం పరిశ్రమలను ఓపన్ చేయకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మిక నేతలు.
రెండు వారాల పాటు ఉపాధి లేకుండా జీవించటం ఎలా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే పనిని నమ్ముకుని జీవిస్తున్నామని, తమకు వేరే పని తెలీదని కార్మికులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఇదంతా కృత్రిమ కొరత సృష్టించటానికి వ్యాపారులు వేసిన ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు కార్మిక నేతలు. నేటికి 8 రోజులుగా మూసి ఉన్న 250కి పైగా జీడి పరిశ్రమల్లో సుమారు 15 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.
తాము ఇచ్చిన డెడ్‌లైన్ సోమవారం నాటికి పరిశ్రమలు తెరవాల్సి ఉండగా అలాంటి వాతావరణం కనిపించకపోవడంతో మరోసారి కార్మిక సంఘాలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాయని కార్మిక నేతలు చెబుతున్నారు. అకస్మాత్తుగా పరిశ్రమలను మూసివేయటం కార్మిక చట్టాలకు విరుద్దమని వారు వాదిస్తున్నారు.
పలాస, కాశీబుగ్గ పరిధిలోని జీడి పరిశ్రమలు మూసేయటం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలుసార్లు పరిశ్రమమలను మూకుమ్మడిగా మూసేశారు. కిందటేడాది కూడా ఇదే కారణంతో ఇదే సీజన్‌లో రెండు వారాల పాటు పరిశ్రమలను మూసేస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కార్మికుల ఆందోళనలతో దిగొచ్చిన యాజమాన్యాలు వారంలోనే బంద్‌ను విరమించాయి. ధరలు పడిపోయాయని, ఎగమతులు లేవని, రకరకాల కారణాలతో యాజమాన్యాలు ఇలా చేయటం పరిపాటిగా మారింది. నిజానినికి ప్రస్తుతం జీడిపప్పుకు విపరీతమైన డిమాండ్ ఉందని మరికొందరు చెబుతున్నారు.
యాజమాన్యాలు కేవలం రైతులు, కార్మికుల గొంతు నొక్కేందుకే ఇలా చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. జీడి రైతులు, కార్మికుల డిమాండ్లను పక్కదారి పట్టించేందుకే యాజమాన్యాలు పరిశ్రమ మూత డ్రామా ఆడుతున్నాయని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అటు జీడి రైతులు, కార్మికులు.. ఇటు పరిశ్రమ యాజమాన్యాలు అందరికీ న్యాయం జరగాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రం సరైన పాలసీని తీసుకురావాలని మేథావులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..