NTR Birth Anniversary: ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు ప్రారంభం.. మహానాడు వేదికగా టీడీపీ భారీ బహిరంగసభ..
టీడీపీ వ్యవస్థపకుడు ఎన్టీఆర్ శతజయంతోత్సవాల నేపథ్యంలో మహానాడు రెండో రోజున ప్రత్యేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
NTR Birth Anniversary celebrations: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ వ్యవస్థపకుడు ఎన్టీఆర్ శతజయంతోత్సవాల నేపథ్యంలో మహానాడు రెండో రోజున ప్రత్యేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఒంగోలులోని మండువవారిపాలెంలో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. శనివారం ఉదయం ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటర్‌లోని ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి చంద్రబాబుతోపాటు పలువురు టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.
నిమ్మకూరులో వేడుకలు..
ఇదిలాఉంటే.. జయంతోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరై నివాళులర్పించనున్నారు.
హిందూపురానికి వసుందరాదేవి..
శతజయంతోత్సవాల్లో భాగంగా శనివారం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి రానున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 కు వసుంధరాదేవి అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు.
నివాళులర్పించిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్..
నందమూరి తారక రామారావు శత జయంతోత్సవాల సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్‌కి వెళ్లి నివాళులర్పించారు. వారితో పాటు లక్ష్మీపార్వతి కూడా నివాళులు అర్పించారు. అదే సమయంలో అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..