చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా చూసుకొంది. అల్లారుమద్దుగా పెంచింది. ఏది అడిగినా కాదు అనకుండా ఇచ్చింది. అలాంటి తల్లి లేని లోకం నాకొద్దు అని తాను ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. విజయనగరం జిల్లా రాజాం మండలం మెంతిపేటకు చెందిన అమూల్యరావు శ్రీకాకుళం జిల్లాలో కండక్టర్‌గా పనిచేసేవాడు. గత ఏడేళ్ల క్రితం అమూల్యరావు అనారోగ్యంతో మృతి చెందాడు. తరువాత కారుణ్య నియామకాల్లో భాగంగా భర్త ఉద్యోగం భార్య కురుమమ్మకు వచ్చింది. అలా ఆరేళ్ల నుండి ఆమె కండక్టర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు కాగా పెద్ద కుమారుడు అమర్ ఏలూరు జిల్లా పెదవేగి మండలం జానంపేటలో క్రిస్టియన్ మత ప్రభోదకుడుగా విద్య అభ్యసిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్లిన కురిమమ్మకు సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు.. ప్రాథమిక చికిత్స అందించినా ప్రయోజనం లేక కురిమమ్మ తుదిశ్వాస విడిచింది. ఆర్టీసి అధికారులు కుటుంబసభ్యులకు కురిమమ్మ మరణవార్త చేరవేశారు. ఇదే విషయాన్ని తన సోదరుడు అమర్ కు తెలియజేశాడు కురిమమ్మ చిన్న కుమారుడు.
తల్లి మరణవార్త విన్న అమర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆవేదన చెందాడు, పెద్దగా రోధించాడు. తన తల్లి లేని జీవితం వద్దని నిర్ణయానికి వచ్చాడు. తల్లి లేని లోకంలో తాను ఉండలేనని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులంతా కురిమమ్మ మృతదేహాన్ని శ్రీకాకుళం నుండి సొంత గ్రామానికి తరలించే ప్రయత్నంలో ఉండగానే కొడుకు అమర్ మరణవార్త అందింది. దీంతో ఒక్కసారిగా ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దిరిల్లింది. అందరితో సరదా సరదాగా గడిపే అమర్, మరి కొద్ది రోజుల్లో కోర్స్ పూర్తిచేసుకొని మత ప్రభోధకుడుగా ప్రపంచానికి పరిచయం అయ్యే సమయంలో అమర్ ఆత్మహత్యకు పాల్పడటాన్ని బంధువులు, గ్రామస్తులు తట్టుకోలేక పోతున్నారు. తల్లి పై అమర్ కు ఉన్న ప్రేమ అమితమైనదని, వారిది విడదీయరాని బంధం అని అంటున్నారు గ్రామస్తులు. తల్లికొడుకుల ఇద్దరి దహన సంస్కారాలు ఒకేచోట, ఒకేసారి చేయనున్నారు గ్రామస్తులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..