- Telugu News Photo Gallery History of World's Largest Banyan Tree 'Thimmamma Marrimanu in sri satya sai district
Thimmamma Marrimanu: తిమ్మమ్మ సతీసహగమనం చేసిన చోటే వెలసిన మర్రి చెట్టుకు 660 ఏళ్ల చరిత్ర..
శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం, గూటిబయలు గ్రామంలో తిమ్మమ్మ మర్రిమాను వెలిసింది. ఈ మర్రి చెట్టు ఒకే ఖాండంతో దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు.1989 వ సంవత్సరంలో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందింది. ఈ మహా వృక్షాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుండి కూడా సందర్శకులు వేలాదిగా వస్తుంటారు.
Nalluri Naresh | Edited By: Surya Kala
Updated on: Jul 24, 2023 | 12:48 PM

జిల్లాలోని బుక్కపట్టణం గ్రామానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబను నంబులపూలకుంట మండలం గూటిబైలు గ్రామానికి చెందిన బాలవీరయ్యతో వివాహం జరిపించారు. కొంతకాలం అనంతరం వీరయ్య మరణించాడు. భర్త మరణంతో తిమ్మమాంబ సతీ సహగమనానికి సిద్ధమైంది. చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను (కట్టెలు) నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి మహా వటవృక్షంగా ఎదిగింది.

1989లో సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి మర్రిమాను ప్రపంచ పుటల్లో స్థానం పొందేందుకు కృషిచేశాడు. 1989లో ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టుగా గిన్నిస్ రికార్డు సాధించింది. 6,869 ఊడలతో ఎనిమిదిన్నర ఎకరాల్లో విస్తరించింది. ఈ మర్రిచెట్టుకు దాదాపు 660 సంవత్సరాల చరిత్ర ఉంది. మర్రిమాను కిందికి వెళ్తే.. ఏదో అరణ్యంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అడుగడుగునా ఓ మర్రిఊడ కనిపిస్తుంది. ప్రతీ ఊడ చెట్టు మొదలు గానే అనిపిస్తుంది. ఆకాశమంత హరిత పందిరితో భూమంతా ఆక్రమించిన మహా వటవృక్షాన్ని సందర్శకులకు కనువిందు చేస్తుంది....

తిమ్మమ్మ సతీ సహగమనం చేసిన చోట నాటబడ్డ ఒక గుంజ (కట్టే) ఈరోజు ఇంత పెద్ద మర్రిమానుగా వృద్ధి చెందిందని భక్తులు భావిస్తారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజలు చెయ్యడం వలన పిల్లలు కలుగుతారు అని భావిస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.

తిమ్మమ్మ సతీ సహగమనం చేసిన చోట మొలచబడ్డ మొక్క ఈరోజు ఇంత పెద్ద మర్రిమానుగా వృద్ధి చెందింది అని భక్తులు విశ్వాసం... తిమ్మమ మర్రిమాను వృక్షం పైన ఏ పక్షీ కూడా మల విసర్జన చెయ్యదని చెపుతారు. అంతే కాకుండా సాయంత్రం ఆరు గంటల సమయం అవ్వగానే పక్షులేవీ ఈ చెట్టు పై ఉండకపోవడం ఈ మహావృక్షం ప్రాముఖ్యత..

15వ శతాబ్దం ప్రథమభాగంలో భర్త బాల వీరనాయకునితోపాటు సహగమనం చేసిన తిమ్మమ్మకు స్థానికులు భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించారు. తిమ్మమ్మ గంగరాజు ఆస్థానంలో గూటిబయలు సంస్థానానికి ప్రతినిధిగా ఉన్న బాల వీరనాయకుడిని వివాహం చేసుకుంటుంది. అప్పట్లోనే ఆమె తన సంస్థాన కార్యక్రమాలను చక్కగా నిర్వహించేది. సామాజిక సంక్షేమానికి కృషిచేసేది. అయితే కుష్ఠువ్యాధిగ్రస్తుడైన వీరనాయకుణ్ణి గంగరాజు వెలివేస్తాడు.

అప్పుడు ఊరి బయట ఉన్న తమ పశువుల పాకనే కుటీరంగా చేసుకుని భర్తకు సేవ చేస్తూ జీవిస్తుంది తిమ్మమ్మ. తన పాతివ్రత్య మహిమతో గంగరాజును శపిస్తుంది. ఫలితంగా వాళ్ల కోటను వదిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతారు. ఆరు నుంచి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ మర్రి వృక్షం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. రాయలసీమలో అనంతపురం జిల్లాలో నీటి కొరత ఉన్నప్పటికీ తిమ్మమ్మ మర్రిమాను ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి, పచ్చని ఆకులతో పక్షుల కిలకిలరావాలతో చూపరులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.

మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్ నిర్మించారు. తిరుపతి తిరుమల దేవస్థానం వారు వెంకటేశ్వరాలయం నిర్మాణం చేపట్టారు. ఈ చెట్టు క్రింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి ఉంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద "తిమ్మమ్మ 1394 లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప, మంగమ్మలకు జన్మించింది. 1434 లో సతీ సహగమనం చేసింది" అని ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి....





























