AP News: పార్క్ చేసిన స్కూటీలో వింత శబ్దాలు.. భయంగానే వెళ్లి చూడగా.. అమ్మబాబోయ్!
సాధారణంగా ఈ రోజుల్లో పాములంటే ఎవరికైనా భయం. అందులోనూ విషపూరితమైనవి అయితే అమ్మ బాబోయ్ అనాల్సిందే. అలాంటి సర్పం ఒకటి పార్క్ చేసిన స్కూటీలో దూరి భయభ్రాంతులకు గురిచేసింది.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన రాజు పట్టణంలో బుజ్జమ్మ టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఇవాళ ఉదయం టీ స్టాల్ ఓపెన్ చేసి.. ఛాయ్ అమ్ముతున్నాడు. అయితే మధ్యాహ్నం సమయంలో టీ స్టాల్ యజమాని రాజుతో పాటు అక్కడ టీ త్రాగడానికి వచ్చిన వారిని భయపెట్టింది ఓ సర్పం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. నేరుగా పాకుతూ చెట్టు కింద పార్క్ చేసిన టీ స్టాల్ యజమాని రాజు స్కూటీలోకి దూరింది. ఈ మొత్తం ఘటనను అక్కడ ఉన్నవాళ్లు చూస్తూ ఊరుకోవడం మినహా ఏమీ చేయలేకపోయారు. అయితే స్కూటీలో దూరిన పాము ఎంతకూ బయటకు రాలేదు. దీంతో స్కూటీ ఓనర్ రాజు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
అసలు అందులోకి ఏ పాము దూరిందో ఏమోనని తెగ టెన్షన్ పడిపోయాడు. వెంటనే పట్టణంలో ఉన్న బైక్ మెకానిక్‌ను పిలిపించాడు. పాము దూరిన విషయం చెప్పడంతో ఎలాగైనా బయటకు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సుమారు గంటపాటు స్కూటీ ఒక్కో భాగం విప్పుతూ పాము బయటకు వచ్చేలా చేశారు. పాము బయటకు వచ్చిన తర్వాత అది జెర్రిపోతుగా గుర్తించారు. స్కూటీలో నక్కిన పాము ఎట్టకేలకు బయటకు రావడంతో యజమాని రాజుతో పాటు అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పాము ఎవరికైనా అపాయం కలిగిస్తుందేమోనని అక్కడ ఉన్నవారు ఆ పామును కొట్టి చంపారు. ఇక టీ త్రాగడానికి వచ్చిన మిగిలినవాళ్లు వాళ్ల బైక్‌ను తీసుకెళ్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..