AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada – Hyderabad: హైదరాబాద్ వస్తున్నారా..? ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దంటే ఈ రూట్లల్లో వెళ్లండి..

పల్లె జనం చలో హైదరాబాద్ అంటున్నారు. వారం రోజులు సంక్రాంతి సంబరాల్లో మునిగితేలిన జనం మళ్ళీ 'పట్నం బాట పట్టారు. దీంతో పల్లెల్లో సందడి తగ్గి, హైవేలపై రద్దీ పెరిగింది. ఇటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనసంద్రంగా మారాయి. ఈ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు అధికారులు..

Vijayawada - Hyderabad: హైదరాబాద్ వస్తున్నారా..? ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దంటే ఈ రూట్లల్లో వెళ్లండి..
Vijayawada Hyderabad Highway
Shaik Madar Saheb
|

Updated on: Jan 18, 2026 | 9:15 PM

Share

సంక్రాంతి రద్దీ మళ్లీ మొదలైంది. వారం రోజుల సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు బయలుదేరడంతో ప్రధాన నగరాల బస్‌ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌లలో భారీ రద్దీ నెలకొంది. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువైంది.

నల్గొండ జిల్లా చిట్యాల వద్ద రద్దీ మరింత ఎక్కువగా కనిపించింది. వేల సంఖ్యలో కార్లు, ఇతర వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు వాహనాలను చిట్యాల నుంచి కుడివైపు సింగిల్‌ రోడ్డులో భూవనగిరి మీదుగా హైదరాబాద్‌ వైపుకు మళ్లించారు. వాహనాల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు డ్రోన్‌ కెమెరాలు, సీసీటీవీల సహాయంతో ట్రాఫిక్‌ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సోమవారం కూడా ఇదే స్థాయిలో వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉంది.

ఆదివారం అమావాస్య కావడంతో చాలా మంది సొంతూరు విడిచి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అమావాస్య వేళ ప్రయాణాలు మంచిది కాదని జర్నీని సోమవారానికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. దీంతో హైదరాబాద్​ వచ్చే వాహనాలను అవసరమైన చోట్ల దారి మళ్లిస్తున్నారు అధికారులు. చిట్యాల, పెద్దకాపర్తి, కొర్లపహాడ్, పంతంగి టోల్​ప్లాజాల దగ్గర ట్రాఫిక్​ జామ్​ అయ్యే అవకాశాలు అధికంగా ఉండటంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.

ట్రాఫిక్ డైవర్షన్ రూట్ ఇదిగో..

– గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలంటూ డైరెక్షన్‌ ఇచ్చారు అధికారులు.

– మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు నాగార్జునసాగర్, పెద్దవూర, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్‌కు రీచ్‌ అవ్వాలి.

– నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మర్రిగూడ బై పాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటే సులభంగా ఉంటుందన్నారు అధికారులు.

– ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి నుంచి మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని పోలీసులు సూచించారు.

మరోవైపు వాహనదారులకు పొగమంచు చుక్కలు చూపిస్తోంది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు ముసురుకోవడంతో తిరుగు ప్రయాణం అత్యంత కష్టతరంగా మారింది. పొగమంచుతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనదారులు ఫాగ్ లైట్లు, హెడ్ లైట్లు ఆన్ చేయాలని, హైస్పీడ్‌లో ఓవర్‌టేక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..