న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రిని 2023వ సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ అనే లఘు కథల పుస్తకానికి ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా 24 భాషల్లో రాసిన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్డులో రబీంద్ర భవన్‌లోని సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అవార్డులను ప్రకటించారు. వీటిల్లో 5 భాషల్లో చిన్న కథలు అవార్డులు గెలుచుకోగా వాటిలో ఒకటి తెలుగు కథ కావడం విశేషం.
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి 1945లో పిఠాపురంలో జన్మించారు. విద్యాభ్యాసం అంతా ఒంగోలులోనే గడిచింది. తల్లి మహాలక్ష్మి, తండ్రి కృత్తివాస తీర్థులు. పతంజలి శాస్త్రి ఇరువైపుల తాతగార్లు కూడా సాహితీవేత్తలే. తల్లావఝల శివశంకర శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిష్ఠులు. ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ చేసిన అనంతరం పూణె నుంచి ఆర్కియాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఆ తర్వాత అమలాపురం కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా, ప్రిన్సిపల్‌గా కూడా పనిచేశారు. కొంతకాలం తర్వాత ‘ఎన్విరాన్‌మెంట్ సెంటర్’స్థాపించి పర్యావరణ రంగంలో కృషి చేశారు. ప్రస్తుతం భార్య విజయలక్ష్మితో కలిసి రాజమండ్రిలో జీవనం గడుపుతున్నారు. వీరి దంపతులకు కుమారుడు శశి, కుమార్తె గాయత్రి ఉన్నారు.
1960 నుంచి ఆయన కథలు రాస్తున్నారు.‘వడ్ల చిలుకలు’, ‘పతంజలి శాస్త్రి కథలు’, ‘నలుపెరుపు’, ‘రామేశ్వరం కాకులు’ పతంజలి శాస్త్రి రచించిన కథాసంపుటాలు. ఆయన రచించిన రామేశ్వరం కాకులు నుంచీ రోహిణి కథ వరకూ పలు కథలను ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ పేరిట పుస్తకంగా ముద్రించారు. ఈ కథాసంపుటికిగానూ తాజాగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ‘హోరు’, ‘దేవర కోటేశు’, ‘గేద మీద పిట్ట’ అనే నవలలు కూడా రాశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.