Lok Sabha Election: మొదలైన సార్వత్రిక ఎన్నికల హడావిడి.. ఓట్ల జాబితాపై ఈసీ స్పెషల్ ఫోకస్.. అధికారులతో వరుస భేటీలు
ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లపై తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి.

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కసరత్తు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఏర్పాట్లు ప్రారంభించనుంది. 2019 లో ఏపీ అసెంబ్లీ తో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి..వచ్చే ఏడాది జూన్ 10 వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా రెండు ఎన్నికలను ఒకే సారి నిర్వహించే అవకాశాలపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది.
ఇందులో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లపై తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు ఫిర్యాదులు చేశాయి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సైతం వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారనేది ప్రధాన పార్టీల ఆరోపణ. ఫారం – 7 ద్వారా భారీగా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఒకవైపు ఓటర్ల జాబితాపై ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలపై ఎన్నికల సంఘం అధికారులు పరిశీలన చేస్తున్నారు. డిసెంబర్ 26వ తేదీ వరకు ఓటర్ జాబితా పరిశీలన జరగనుంది. ఆ తర్వాత జనవరి ఐదోవ తేదీన ఫైనల్ ఎస్ఎస్ఆర్‌ను విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్. ఈ ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగానే కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం గురువారం సాయంత్రం రాష్ట్రానికి రానుంది. డిసెంబర్ 22, 23 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు అయా జిల్లాల ఉన్నత అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు
కలెక్టర్లు, ఎస్పీలతో సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఏపీకి వస్తుండటంతో ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. గురువారం సాయంత్రం రాష్ట్రానికి వస్తున్న ఈసీ టీమ్ రెండు రోజుల పాటు అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విడివిడిగా సమావేశం కానున్నారు. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. మొదటి రోజు 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అవుతారు. డిసెంబర్ 23న 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అవుతారు. జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు,పోలింగ్ కేంద్రాల ఏర్పాటు,సమస్యాత్మక ప్రాంతాలు, పోలీస్ సిబ్బంది వంటి అన్ని అంశాలపై చర్చించనున్నారు.
అలాగే డిసెంబర్ 23వ తేదీ మద్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ఎన్నికలకు సంబంధించిన శాఖల రాష్ట్ర, కేంద్ర అధికారులతో సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటనలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమావేశంలో ఓటర్ జాబితాపైనా అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది. జనవరి 5వ తేదీన విడుదల చేసే ఫైనల్ SSR జాబితా పైనా చర్చించనున్నారు. ఏపీలో అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. కాబట్టి పక్కాగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి వస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా అన్ని వివరాలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా ఈసీ పర్యటనతో ఎన్నికల ప్రక్రియకు మొదటి అడుగు పడనుంది.
ముందస్తు పై క్లారిటీ వస్తుందా?
2019 లో అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 10వ తేదీన షెడ్యూల్ జారీ అయింది. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి కొంచెం ముందుగానే ఎన్నికలు జరగవచ్చని ప్రచారంతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం స్పష్టత ఇస్తుందా అని ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల పర్యటనలో ఈ అంశంపై కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…