జనాభా అసమతుల్యత, యువతలో మాదకద్రవ్యాల వ్యసనంపై RSS సమన్వయ సమావేశంలో కీలక చర్చలు
విశాఖపట్నం సమీపంలోని గుడిలోవాలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. జనాభా అసమతుల్యత, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం, పంచ పరివర్తన్, భారతీయ అభివృద్ధి నమూనా తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా 32 సంఘ్ ప్రేరిత సంస్థలకు చెందిన సుమారు 327 మంది ప్రతినిధులు పాల్గొంటారు.

జనాభా అసమతుల్యత, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వంటి కీలక అంశాలపై మూడు రోజుల పాటు చర్చించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత సమన్వయ సమావేశం విశాఖపట్నం సమీపంలోని గుడిలోవా విజ్ఞాన విహార్ పాఠశాలలో బుధవారం ప్రారంభం కానుంది. ఆగస్టు 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం 21వ తేదీ సాయంత్రం వరకు కొనసాగనుంది.
మంగళవారం మధ్యాహ్నం సమావేశ వేదిక వద్ద మీడియాతో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్.. దేశంలో చోటుచేసుకుంటున్న సామాజిక పరిణామాలు, ప్రస్తుత జాతీయ పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దేశంలో మారుతున్న జనాభా నమూనాలు, వాటి ప్రభావాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చ ఉంటుందని చెప్పారు.
32 సంఘ్ ప్రేరిత సంస్థల ప్రతినిధులు
మూడు రోజుల సమావేశానికి సంఘ్ ప్రేరణతో పనిచేస్తున్న 32 సంస్థలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్‌కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే, సహ సర్‌కార్యవాహ్‌లు, ఇతర కేంద్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్), రాష్ట్ర సేవికా సమితి తదితర సంస్థల జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటనా కార్యదర్శులు సమావేశానికి హాజరుకానున్నారు. మొత్తంగా సుమారు 327 మంది ప్రతినిధులు పాల్గొంటారని సునీల్ అంబేకర్ తెలిపారు. వీరిలో దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన 253 మంది ప్రతినిధులు ఉండగా.. 49 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు.
యువతను మాదకద్రవ్యాలకు దూరం చేయడంపై ప్రత్యేక దృష్టి
యువతలో పెరుగుతున్న డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాల వినియోగంపై ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. యువతను వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించడం, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు సమాజంలోని వివిధ వర్గాలను భాగస్వాములను చేసే విధానాలపైనా దృష్టి సారించనున్నారు. అదే సమయంలో దేశంలో మారుతున్న జనాభా పరిస్థితులు, వాటి విస్తృత ప్రభావాలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకోనున్నారు.
‘పంచ పరివర్తన్’పై తదుపరి కార్యాచరణ
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో సమాజంలో ‘పంచ పరివర్తన్’ పేరుతో ఐదు అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సామాజిక సమరసత, పర్యావరణ అనుకూల జీవనశైలి, కుటుంబ విలువలు, స్వ భావన, పౌర కర్తవ్యాల నిర్వహణ ఇందులో ఉన్నాయి. శతాబ్ది సంవత్సరంలో ఈ అంశాలపై కొనసాగుతున్న కార్యక్రమాలు, వాటి ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
భారతీయ అభివృద్ధి నమూనాపై చర్చ
ఆర్థిక అభివృద్ధితో పాటు సమాజంలోని అన్ని రంగాల్లో సమగ్ర పురోగతి సాధించేలా ‘భారతీయ అభివృద్ధి నమూనా’ను రూపొందించాల్సిన అవసరం ఉందని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. అభివృద్ధిని కేవలం ఆర్థిక సూచికలకే పరిమితం చేయకుండా.. సామాజిక, సాంస్కృతిక, విద్యా, పర్యావరణ తదితర రంగాల్లోనూ సమతుల్య పురోగతి ఉండాలని తెలిపారు.
ఈ సమావేశం ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయాలు తీసుకునే వేదిక కాదని ఆయన స్పష్టం చేశారు. వివిధ సంఘ్ ప్రేరిత సంస్థలు తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడం, సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, సమాజ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను అన్వేషించడమే ప్రధాన ఉద్దేశమని వివరించారు.
ఆర్ఎస్ఎస్‌లో చేరేందుకు యువత ఆసక్తి
శతాబ్ది సంవత్సరంలో ఆర్ఎస్ఎస్‌పై ప్రజల్లో ఆసక్తి బాగా పెరిగిందని సునీల్ అంబేకర్ తెలిపారు. ‘జాయిన్ ఆర్ఎస్ఎస్’ వెబ్‌సైట్ ద్వారా 2025 జనవరి నుంచి జూలై వరకు 57,423 మంది నమోదు చేసుకోగా.. 2026లో అదే కాలంలో ఈ సంఖ్య 1,23,287కు పెరిగిందన్నారు. నమోదు చేసుకున్న వారిలో 65 శాతానికి పైగా 30 ఏళ్లలోపు యువత ఉండగా.. దాదాపు 85 శాతం మంది 40 ఏళ్లలోపు వారేనని వెల్లడించారు.
మీడియా సమావేశంలో దక్షిణ మధ్య క్షేత్ర సహ సంఘ్‌చాలక్ దుసి రామకృష్ణ, సహ ప్రచార ప్రముఖ్ ప్రదీప్ జోషి, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్య వాసు, సహ ప్రచార ప్రముఖ్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
