విద్యావనంలో గంజాయి మొక్క.. ఉలిక్కిపడ్డ విద్యార్థులు.. ఉస్మానియాకు ఎలా వచ్చిందబ్బా..!
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క లభ్యం కావడం కలకలం రేపింది. ఇది సహజంగా మొలిచిందా లేదా ఉద్దేశపూర్వకంగా నాటారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. క్యాంపస్‌లోని ఇతర ప్రాంతాలలోనూ తనిఖీలు చేపట్టాలని, గంజాయి మొక్క మూలాలు, దీని వెనుక ఉన్న కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది విద్యార్థుల భద్రత, క్యాంపస్ వాతావరణంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కనిపించడం కలకలం రేపింది. విద్యార్థులు చదువుకునే ప్రాంగణంలో గంజాయి మొక్క ఎలా పెరిగిందనే అంశంపై ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొక్క సహజంగా మొలిచిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నాటారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉస్మానియా క్యాంపస్‌లోని ఓ ప్రాంతంలో గంజాయి మొక్కను విద్యార్థులు గుర్తించారు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఇలాంటి మొక్కలు మరెక్కడైనా ఉన్నాయా? అనే చర్చ మొదలైంది. గంజాయి సిగరెట్ నుంచి పడిన విత్తనం వల్ల మొక్క మొలిచి ఉండొచ్చా? లేదా ఎవరైనా గంజాయి విత్తనాలను అక్కడ పడేసి ఉండొచ్చా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మొక్క అక్కడికి ఎలా వచ్చిందనే విషయం అధికారుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.
విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది రాకపోకలు ఉండే యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇలాంటి మొక్క కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని విద్యార్థి నాయకుడు సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. కేవలం ఒక మొక్కను గుర్తించి తొలగించడంతో సరిపెట్టకుండా.. క్యాంపస్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టాలని కోరారు.
అలాగే గంజాయి మొక్క అక్కడికి ఎలా వచ్చిందనే విషయంపై యూనివర్సిటీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మొక్కను శాస్త్రీయంగా పరిశీలించడంతో పాటు, అది సహజంగా మొలిచిందా లేదా ఎవరైనా నాటారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
