AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: సర్.! ఆఫీస్‌పై ఏసీబీ రైడ్స్ అంట.. ఫోన్ కాల్ రాగానే దడుసుకున్నాడు.. కట్ చేస్తే

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త ప్లాన్ వేసి సామాన్యులను, ఉద్యోగస్తులను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్‌ను ఏసిబి అధికారులమంటూ రెండు లక్షలకు టోకరా వేశారు. ఆ వివరాలు ఇలా..

Andhra: సర్.! ఆఫీస్‌పై ఏసీబీ రైడ్స్ అంట.. ఫోన్ కాల్ రాగానే దడుసుకున్నాడు.. కట్ చేస్తే
Representative Image
B Ravi Kumar
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 14, 2025 | 12:37 PM

Share

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త ప్లాన్ వేసి సామాన్యులను, ఉద్యోగస్తులను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్‌ను ఏసిబి అధికారులమంటూ రెండు లక్షలకు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న సబ్బితి శ్రీనివాస్‌కు తాము విజయవాడ ఏసిబి అధికారులమంటూ 8522010969 ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసి మీ కార్యాలయంలో, మీపై అనేక అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. మీ కార్యాలయంపై ఏసిబి రైడ్ చేస్తున్నాం. మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలులో వేస్తామని కాల్ చేసి బెదిరించారు. దీంతో భయపడిపోయిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ తనను వదిలేయమని వారిని బ్రతిమాలగా నేరగాళ్లు రైడ్ చేయకుండా ఉండాలంటే మూడు లక్షలు రూపాయలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దీంతో సబ్ రిజిస్ట్రార్ వెంటనే నేరగాళ్లు ఇచ్చిన ఫోన్ నెంబర్ 8522010969కు తన నెంబర్ నుంచి లక్ష రూపాయలు, తన స్నేహితులైన ఆకాశం ప్రశాంత్, గుండు నాగేంద్ర కుమార్ ఫోన్ల నుంచి మరో లక్ష రూపాయలు ఫోన్ పే చేసాడు. అయితే అక్కడితో ఆగని సైబర్ నేరగాళ్లు రెండు లక్షలు మాత్రమే వేసావు.. మరో లక్ష రూపాయలు కూడా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌కు అనుమానం వచ్చి ఏసీబీ అధికారులను సంప్రదించగా.. తాము అటువంటి కాల్స్ ఎవరికీ చేయమని ఎవరో మిమ్మల్ని మోసం చేశారని చెప్పారు. మోసపోయానని తెలుసుకున్న శ్రీనివాస్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయగా.. మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

నేరగాళ్లు ఇచ్చిన ఫోన్ నెంబర్ అకౌంట్‌ను పరిశీలించగా అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్బీఐ బ్రాంచ్‌లో వడ్డే రామాంజనేయులు అనే వ్యక్తి అకౌంట్‌గా గుర్తించారు. సైబర్ నేరగాళ్లు ఇటీవల రాష్ట్రంలో ఎక్కువ అవినీతి జరిగే ఆఫీసులను టార్గెట్ చేసి ఏసిబి అధికారులమంటూ కాల్ చేసి డబ్బులు ఇవ్వకపోతే మీపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించి లక్షలు దోచేస్తున్నారు. కొందరు ఉద్యోగస్తులు పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు పరువుపోవడంతో పాటు తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని గప్ చుప్‌గా ఊరుకుంటున్నారు.