Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sattenapalle: శివరాం నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఏంటి..? టీడీపీ జెండాతోనే జనంలోకి వెళ్తున్నా….

కోడెల శివరాం డిమాండ్స్‌పై టీడీపీ అధిష్ఠానం స్పందించదా? శివరాం తిరుగుబాటుని పార్టీ లైట్‌ తీసుకుందా? కోడెల దూకుడుకి కారణమేంటి? ఒత్తిడి పెంచి హామీ పొందాలనా? లేకపోతే సస్పెన్షన్ వేటు వేయించుకోవాలనా? శివరాం అంశంతో కన్నాకు తలనొప్పులు తప్పటం లేదా? సత్తెనపల్లి టీడీపీ సంక్షోభానికి పార్టీ పెద్దల దగ్గరున్న పరిష్కారమేంటి?

Sattenapalle: శివరాం నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఏంటి..? టీడీపీ జెండాతోనే జనంలోకి వెళ్తున్నా....
Kodela Sivaram - Chandrababu - Kanna Lakshmi Narayana
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 07, 2023 | 7:02 PM

కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత సత్తెనపల్లి టీడీపీలో తలెత్తిన సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడంలేదు. మొన్నటిదాకా ముచ్చటగా ముగ్గురు నేతలు నువ్వానేనా అంటుంటే.. టీడీపీ అధినాయకత్వం నాలుగోనేతను తెరపైకి తెచ్చింది. బలమైన నేతగా కన్నాకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించినా అసంతృప్తి మాత్రం అలాగే ఉంది. తండ్రి వారసత్వంపై నమ్మకం పెట్టుకున్న కోడెల శివరాం.. కన్నాకు పదవితో తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అధినాయకత్వం సూచనతో పల్నాడు నాయకులు శివరాంతో చర్చలు జరిపినా ఆయన అలకపాన్పు దిగలేదు.

కన్నాకు సత్తెనపల్లి ఇంచార్జి పదవి ఇవ్వటంతో తనకు టికెట్‌ లేదన్న అభిప్రాయానికి వచ్చారు కోడెల శివరాం. పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ అధిష్ఠానంపైనే విమర్శలు చేశారు. కలిసి మాట్లాడేందుకు చంద్రబాబు ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు శివరాం. జీవీఎస్ ఆంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, డోలా వీరాంజనేయస్వామి కోడెల శివరాంతో చర్చలు జరిపారు. ఆ సమయంలో నర్సరావుపేట లోక్‌సభ ఇంచార్జిగానైనా తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగానే అడిగారట శివరాం. ఇదే విషయాన్ని ఆ నాయకులు పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అయితే చంద్రబాబు దీనిపై ఇప్పటిదాకా స్పందించకపోవటంతో కోడెల శివరాం దూకుడు పెంచారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ కలకలం రేపుతున్నారు. తండ్రి హయాంలో మొదలు పెట్టి అసంపూర్తిగా ఉన్న చర్చిలు, గుళ్లు, విగ్రహాలపై దృష్టి సారించారు. పాత పరిచయస్తులను కలుసుకుంటున్నారు. టీడీపీ జెండాతోనే జనంలోకి వెళ్తున్నారు. దీంతో శివరాం ఉద్దేశం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

కోరుకున్న పదవి పొందాలన్న పట్టుదలతో కోడెల శివరాం ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పదవి దక్కకపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదన్న భావనలో ఆయనున్నట్లు చెబుతున్నారు. అందుకే పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు కోడెల శివరాం. మరోవైపు ఇంచార్జి పదవి దక్కిన తర్వాత కన్నా సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీడ్‌ పెంచారు. పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధికారపార్టీపై ఎలా పోరాటం చేయాలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే శివరాం అంశం మాత్రం కన్నా వర్గానికి ఇబ్బందికరంగానే ఉంది. ఆయన విషయంలో అధిష్ఠానం ఏదోఒకటి తేలిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉందట కన్నా వర్గం. పార్టీ అధినేత కోడెల వారసుడికి అప్పాయింట్‌మెంట్‌ ఇస్తారా లేకపోతే చర్యలు తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. అప్పటిదాకా శివరాం ఎత్తిన తిరుగబాటు జెండా దించేలా లేరంటున్నారు ఆయన అనుచరగణం.

మరిన్ని ఏపీ వార్తల కోసం..