రాయలసీమ టీడీపీ నేతల ఉడుం పట్టు.. అనంత వేదికగా జలాల పోరుకు సరికొత్త తీర్మానం

నిన్న మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితమైన రాయలసీమ జిల్లా టీడీపీ నేతలు ఇప్పుడు

రాయలసీమ టీడీపీ నేతల ఉడుం పట్టు.. అనంత వేదికగా జలాల పోరుకు సరికొత్త తీర్మానం
Rayalaseema Tdp
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 11, 2021 | 8:33 PM

Rayalaseema TDP: నిన్న మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితమైన రాయలసీమ జిల్లా టీడీపీ నేతలు ఇప్పుడు వాయిస్ పెంచడమే కాదు.. ఉద్యమ రూపంలోకి వచ్చారు. ప్రధానంగా కృష్ణాజలాల పై గత కొంత కాలంగా నడుస్తున్న వివాదాల నేపథ్యంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందనేది టీడీపీ వాదన.

అంతేకాకుండా సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీమ జిల్లాల్లో ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారిపోయాయన్నది టీడీపీ నేతల అభిప్రాయం. అందుకే రాయలసీమ టీడీపీ నేతలు కృష్ణజలాల హక్కుల కోసం అనంతపురం వేదికగా ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి అమర్ నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా నాలుగు జిల్లాల నేతలు వారి ప్రాంతంలో ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయం పై స్పందించారు. మా పోరాటం పార్టీ కోసం కాదని.. గత రెండేళ్లుగా రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇది భవిష్యత్ తరాల కోసమేనని కాల్వ శ్రీనివాసులు అన్నారు.

మరోవైపు గడిచిన రెండు సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లాలో ఎలాంటి పనులు జరగడం లేదని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు స్టేట్మెంట్లు ఇవ్వడం మినహా ఏమీ చేయడం లేదు.. చెరువుల్లో నీరు నింపితే ఇసుక తరలించడం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారని అమర్నాథ్ రెడ్డి అన్నారు. అవగాహన లేని ముఖ్యమంత్రి వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు భవిష్యత్తు లేదని.. పోతిరెడ్డి ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైందని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి విమర్శించారు.

మనకు న్యాయంగా రావాల్సిన నీటికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం చెబుతున్నారని ఏరాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఒకప్పుడు అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతపురం జిల్లా కరవు పరిస్థితిని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇటు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ హంద్రీనీవా నీరు వస్తే ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు వస్తుందన్నారు.

ఈ సమావేశంలో నేతలు కొన్ని తీర్మానాలు కూడా చేశారు. రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాలకు ఇచ్చే హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు అధికారికంగా నీటి కేటాయింపులు చేయాలని.. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొనడాన్ని ఈ సదస్సు తీవ్రంగా తప్పుబడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో ఈ సదస్సులు నిర్వహించి అందర్నీ ఏకతాటి పైకి తేవాల్సిన అవసరం ఉందని నిర్ణయానికి వచ్చారు.

Read also: Oxygen Cylinder Blast: గ్యాస్ సిలెండర్ల ట్రక్ పేలుడు సీసీ టీవీ ఫుటేజ్.. నెట్టింట వైరల్ అవుతున్న బ్లాస్ట్ విజువల్స్