మనిషి ఆధునికంగా ఎంత అభివృద్ధి సాధించినా భూమి మీద ఏం దాగుందో మానవుడికి ఇప్పటికీ తెలీదు. అందుకే పుడమిపై రకరాకాల వింత ఆకారాలు, వింత జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి అరుదైన వింత జీవులు ఒకొక్కసారి శాస్త్రవేత్తలకు షాక్ ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా అడవుల్లో అనేక వింతైన, విచిత్ర జీవులు హఠాత్తుగా మనిషి కంటికి కనిపించి కనువిందు చేస్తాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అరుదైన జీవి కనిపించింది. దీనిని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో అరుదైన జీవిని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఏడు కొండల్లో నామాల తొండ దర్శనమిచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలోని అరుదైన తొండను గుర్తించినట్టు అటవీ శాఖ సిబ్బంది వెల్లడించారు. ఫారెస్ట్ లిజార్డ్ గా పిలిచే తొండ అలిపిరి సమీపం లో బండపై దర్శనమిచ్చింది. నిగనిగలాడే నల్లని శరీరం.. వెన్నె పూస మీద తెల్లని నామం దిద్ది, మధ్యలో ఎర్రని తిరుచూర్ణం పెట్టినట్లు అరుదుగా అందంగా ఉంది. ఈ అరుదైన లిజార్డ్ దక్షిణ భారత దేశంలోని రతి కొండలు ఉన్న అడవుల్లో ఎక్కువుగా కనిపిస్తుంది.
వాస్తవానికి సరీసృపాలైన ఈ తొండలు భారతదేశంలో విస్తృతంగా కనిపిస్తాయి. దక్షిణాసియా, దక్షిణ చైనా, ఆగ్నేయాసియాలో అధికంగా దర్శనమిస్తాయి. ఈ తొండల ప్రధాన ఆహారం కీటకాలు. కొన్ని రకాల తొండలు తమ కళ్ళను వేర్వేరు దిశల్లో కదిలించగలవు. మృదువైన చర్మంతో ఉంటాయి. సంతానోత్పత్తి సమయంలో మగ జంతువు ప్రకాశవంతమైన ఎరుపు రంగును సంతరించుకుంటాయి. వీటిల్లో 1,000 కంటే ఎక్కువ జాతులున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..