Dhavaleswaram Water Flow: గంట గంటకు పెరుగుతున్న ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి.. అప్రమత్తమైన అధికారులు
గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి తెలిపారు. నది నీటిప్రవాహాన్ని, వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Dhavaleswaram Water Flow: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి తెలిపారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. నది నీటిప్రవాహాన్ని, వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. లంకల గ్రామ ప్రజల సహాయార్ధం.. ముందస్తు చర్యలను చేపట్టారు. అత్యవసర సహాయక చర్యలకోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. వరద ఉధృతితో సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద దిగువకు వరదనీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని అధికారులు చెప్పారు.
మరోవైపు కాకినాడ జిల్లాలో భారీ వర్షపాత సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ముందస్తు అప్రమత్తతా చర్యలలో భాగంగా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు కలెక్టర్ డా. కృతికా శుక్లా. ఈ కంట్రోల్ రూం 24 గంటల పాటు పనిచేస్తోందని తెలిపారు. అలాగే భారీ వర్షాల సూచన దృష్ట్యా రక్షణ, సహాయ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారను ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..