TDP: NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు టీడీపీ మద్దతు.. స్ట్రాటజీ కమిటీ భేటీలో నిర్ణయం
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్మూకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

NDA రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్మూ(draupadi murmu)కు టీడీపీ మద్దతు ప్రకటించింది. పార్టీ స్ట్రాటజీ కమిటీ భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో కె.ఆర్. నారాయణన్, ఏ.పి.జె. అబ్దుల్ కలాం( A. P. J. Abdul Kalam)లను కూడా బలపరిచినట్లు టీడీపీ తెలిపింది. లోక్‌సభ స్పీకర్ గా బాలయోగిని, శాసనసభ స్పీకర్ గా ప్రతిభా భారతిని టీడీపీ నుంచి పంపినట్లు వెల్లడించింది. ఎర్రంనాయుడుని కేంద్ర మంత్రిని చేయడం ద్వారా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసినట్లు వెల్లడించింది. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు(P.V. Narasimha Rao) ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిందని… తెలుగు వారి కోసం, సామాజిక న్యాయం కోసం తాము ముందు వరుసలో నిలబడ్డామని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సైతం ముర్మూకు మద్దతు ప్రకటించింది. సీఎం ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఆమె నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. NDA అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ బరిలో నిలవగా.. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
