Andhra News: సమాచారంతో గుట్టుగా వెళ్లి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? 

ఎక్సైజ్‌ అధికారిగా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మారారు. 46వ డివిజన్‌లో సారా సేవించే వారిని స్వయంగా ఆయనే వెళ్లి పట్టుకున్నారు. కొత్త సంవత్సరంలోనే రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అధికారులను పరుగులు పెట్టించారు. నగరంలోని గంజాయి, సారా, బ్లేడ్‌ బ్యాచ్‌ నివారణకు శ్రీకారం చుట్టారు. స్థానికంగా సారా విక్రయిస్తున్న మహిళను ఆయన మందలించారు.

Andhra News: సమాచారంతో గుట్టుగా వెళ్లి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? 
Rajahmundry Urban Mla Adireddy Vasu Caught The People Selling Toddy
Follow us
Pvv Satyanarayana

| Edited By: Velpula Bharath Rao

Updated on: Jan 02, 2025 | 5:12 PM

రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కొత్త సంవత్సరంలో అధికారులను పరుగులు పెట్టించారు. నగరంలోని గంజాయి, సారా, బ్లేడ్‌ బ్యాచ్‌ నివారణకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే గత కొన్ని నెలలుగా మీ భద్రత మా బాధ్యత అంటూ ఇప్పటి వరకూ నగరంలోని వివిధ ప్రాంతాలు, విద్యా సంస్థల్లో సుమారు 18 వరకూ సమావేశాలు పెట్టి గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లు, సారా నిర్మూలన పట్ల మహిళల్లో అవగాహన పెంచారు. కాగా స్థానిక 46వ డివిజనకు ఒక అధికారిక కార్యక్రమం నిమిత్తం వెళ్లగా రామదాసుపేటలోని సెల్‌ టవర్‌ వద్ద కొందరు సారా సేవిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ స్థానిక నాయకులతో ఆ ప్రాంతానికి వెళ్ళారు.

ఆయనతో పాటు ప్రొటోకాల్‌ నిమిత్తం వచ్చిన ఇద్దరు పోలీసుల్ని చూసిన సారా సేవిస్తున్న సుమారు ఐదుగురు అక్కడి నుంచి పరార్ అయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు, స్థానిక నాయకులు వారిని పట్టుకున్నారు. స్థానికంగా సారా విక్రయిస్తున్న మహిళను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మందలించారు. ఒక పక్క నుంచి తాము నగరంలో సారా, గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ల నిర్మూలనకు నిరంతరం పాటుపడుతుంటే మీరేమో యథేచ్ఛగా సారా విక్రయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ఎక్సైజ్‌ సీఐ, ఇతర ఎక్సైజ్‌, పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి సదరు విషయమై గతంలోనే తాము ఎస్పీ వారికి ఫిర్యాదు చేసినా చర్యలు ఏవి అని, అందుకే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగామన్నారు. మీ ఉద్యోగం కూడా మేము చేయాల్సి వస్తోందని, సారా విక్రేతలు, సారా సేవించే వారిని తామే పట్టుకుని అప్పగించాల్సిన దుస్థితి వచ్చిందంటూ చురకలు అంటించారు. ఇలా అయితే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు. కాగా ఆ ప్రాంతంలో వేలాదిగా విచ్చల విడిగా సేవించిన ఉన్న సారా ప్యాకెట్ల కవర్లను చూసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ఈ ప్రాంతంలో సారా వ్యాపారం జరుగుతోందని, సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా సారా సేవిస్తున్న, విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి