Andhra: పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ ZPTC అభ్యర్థుల మెజార్టీ ఎంత.. ఇవిగో పూర్తి వివరాలు

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పులివెందులలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్‌ గల్లంతయింది. మరోవైపు పులివెందుల గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారన్నారు ...

Andhra: పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ ZPTC అభ్యర్థుల మెజార్టీ ఎంత.. ఇవిగో పూర్తి వివరాలు
pulivendula-ontimitta-zptc-bypoll results

Updated on: Aug 14, 2025 | 9:31 PM

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ సత్తాచాటింది. పులివెందుల టీడీపీ అభ్యర్థి లతారెడ్డి.. వైసీపీ అభ్యర్థి హేమంత్‌ రెడ్డిపై ఘన విజయం సాధించారు. పులివెందులలో మొత్తం 10,601 మంది ఓటర్లు ఉండగా 7 వేల 814 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6 వేల 716 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు పోల్‌ అయ్యాయి. దీంతో 6 వేల 33 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపొందగా వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పాయారు. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్‌కు 100 లోపు ఓట్లు లభించాయి.

ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలో సైతం టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గ్రాండ్ విక్టరీ సాధించారు. ముద్దుకృష్ణారెడ్డికి 12,780 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో విజయ దుందుభి మోగించారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు

పులివెందుల ఓటర్లు జగన్ అరాచకాల నుంచి బయటపడుతున్నారన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయి కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని ఓటర్లే స్లిప్పులు పెట్టిన పరిస్థితి ఉందన్నారు చంద్రబాబు. మరోవైపు పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్‌ కేంద్రాల్లో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని పిటిషన్‌ దాఖలు చేసింది వైసీపీ. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి