CM Chandrababu: జాతీయ క్రీడలు ఏపీలో జరుగుతాయా..? సీఎం చంద్రబాబుతో పిటీ ఉష భేటీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పి.టి. ఉష సమావేశమయ్యారు. గురువారం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడా అభివృద్ధి, క్రీడాకారుల ప్రోత్సాహం, భవిష్యత్ ప్రణాళికలపై చంద్రబాబు, పీటీ ఉషా విస్తృతంగా చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కొత్త క్రీడా విధానాన్ని ప్రకటించారు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పి.టి. ఉష సమావేశమయ్యారు. గురువారం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడా అభివృద్ధి, క్రీడాకారుల ప్రోత్సాహం, భవిష్యత్ ప్రణాళికలపై చంద్రబాబు, పీటీ ఉషా విస్తృతంగా చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కొత్త క్రీడా విధానాన్ని ప్రకటించారు.. దీని ద్వారా క్రీడాకారులకు విశేష ప్రోత్సాహకాలు అందించబడనున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.7 కోట్లు, వెండి పతకానికి రూ.5 కోట్లు, కాంస్య పతకానికి రూ.3 కోట్లు నగదు బహుమతులు ఇవ్వనున్నారు. అంతేకాక, క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ద్వారా అవకాశాలు కల్పించనున్నారు. ఈ విధానం ద్వారా గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించడం లక్ష్యం.
2029 జాతీయ క్రీడల ఆతిథ్యం
2029లో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ క్రీడలను నిర్వహించాలనే ఆకాంక్షను పిటీ ఉషా తో సీఎం చంద్రబాబు వ్యక్తపరిచారు. ఈ క్రీడలు రాష్ట్ర క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్రీడా నగరాన్ని (స్పోర్ట్స్ సిటీ) నిర్మించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ప్రాంతీయ కేంద్రం
రాష్ట్రంలో సాయ్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఈ కేంద్రం స్థాపనకు పి.టి. ఉషా మద్దతును సీఎం చంద్రబాబు కోరారు. కాకినాడ, గుంటూరు, విశాఖపట్నంలో జాతీయ స్థాయి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా క్రీడాకారుల నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యం..
అమరావతిలో క్రీడా నగరం అభివృద్ధి..
అమరావతిలో సుమారు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 60 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ నుండి ఆర్థిక సహాయం పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది.
క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి
ప్రతి గ్రామంలో మైదానాలను ఏర్పాటు చేసి, క్రీడలను క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా యువతను క్రీడాపై ఆకర్షించడం లక్ష్యం. అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలను నిర్మించడం ద్వారా క్రీడాకారులకు అత్యాధునిక మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఈ సమగ్ర ప్రణాళికల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా రంగంలో విశేష అభివృద్ధిని సాధించి, ప్రతిభావంతమైన యువ క్రీడాకారులకు ఉత్తమ అవకాశాలను అందించేందుకు కృషి చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




