AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rayala Telangana: రాయలసీమ ‘ప్రత్యేక’ చిచ్చు.. అటు ఏపీ.. ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్..!

రాయల తెలంగాణ.. అప్పుడెప్పుడో పదేండ్ల కింద రాష్ట్ర విభజనకు ముందు వినిపించిన నినాదం. తెలంగాణలో అప్పటి పది జిల్లాలకు తోడుగా రాయలసీమ నాలుగు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేశ్‌, జేసీ దివాకర్‌రెడ్డి వంటి సీమ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌కు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కూడా జై కొట్టారు.

Rayala Telangana: రాయలసీమ ‘ప్రత్యేక’ చిచ్చు.. అటు ఏపీ.. ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్..!
Rayalaseema Map
Janardhan Veluru
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 25, 2023 | 3:50 PM

Share

రాయల తెలంగాణ.. అప్పుడెప్పుడో పదేండ్ల కింద రాష్ట్ర విభజనకు ముందు వినిపించిన నినాదం. తెలంగాణలో అప్పటి పది జిల్లాలకు తోడుగా రాయలసీమ నాలుగు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేశ్‌, జేసీ దివాకర్‌రెడ్డి వంటి సీమ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌కు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా అప్పట్లో జై కొట్టారు.  తెలంగాణ రాష్ట్ర విభజన అనివార్యమైతే.. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఎంఐఎం శ్రీకృష్ణ కమిటీకి తన నివేదిక ఇచ్చింది. అయితే తెలంగాణ ఉద్యమకారులు ససేమిరా అనడంతో యూపీఏ ప్రభుత్వం ఆ సాహసానికి పూనుకోలేక పోయింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నే ఏర్పాటు చేసింది. అయితే అదే రాగం మళ్లీ ఇప్పుడు సరికొత్తగా తెరమీదకు వచ్చింది. రాయలసీమను తెలంగాణలో కలుపుకోండి అంటూ కొందరు సీమ నేతలు మళ్లీ సరికొత్త రాగం అందుకుంటున్నారు. ఇక బైరెడ్డి వంటి నేతలైతే ఏకంగా గ్రేటర్‌ రాయలసీమ పేరుతో ప్రత్యేక రాష్ట్రమే ఏర్పాటు చేయాలంటున్నారు. ఇంతకీ రాయల తెలంగాణ లేదా గ్రేటర్‌ రాయలసీమ వంటి డిమాండ్లు మళ్లీ ఎందుకు పురుడు పోసుకుంటున్నాయి? ఎన్నికల సంవత్సరంలో ప్రత్యేకరాగం పాడటం తెలుగు ఉభయ రాష్ట్రాల్లో రాజకీయ కాకరేపుతోంది.

రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షకు హాజరైన నేతలు.. సీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. కొందరు మరో అడుగు ముందుకేసి గ్రేటర్ రాయలసీమ.. మరికొందరి రాయల తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇప్పుడిది తెలుగు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. జేసీ దివాకర్ రెడ్డి  సంచలనాలకు కేరాఫ్‌. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. మొన్నా మధ్య తెలంగాణ అసెంబ్లీ లాబీలో ప్రత్యక్షమైన ఆయన.. ఏపీ కన్నా తెలంగాణలో పాలన బాగుందని మెచ్చుకున్నారు. తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయాం… ఏపీని వదిలేసి.. తెలంగాణకు వచ్చేస్తామని ఓపెన్ అయ్యారు. లేటెస్ట్‌గా రాయల తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని జేసీ డిమాండ్ చేశారు. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం సీఎం కేసీఆర్ కు ఉందన్నారు. ఈ విషయంలో తెలంగాణ నేతలకు కూడా పెద్దగా అభ్యంతరాలు లేవన్నది ఆయన వాదన.

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి కూడా దాదాపు పదేండ్లు కావొస్తుంది. నాడు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమా? హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడమా? లేక రాయలసీమలోని జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడమా? అనే అంశంపై చర్చ జరిగింది. అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణగా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా కేంద్ర ప్రభుత్వం విభజన చేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత జేసీ దివాకర్‌రెడ్డి రాయల తెలంగాణ అంశం తెరపైకి తేవడం సంచలనంగా మారింది. ఎన్నికల సంవత్సరంలో రాయలసీమను తెలంగాణలో కలపాలని జేసీ డిమాండ్‌ ఎత్తుకోవడం సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి
Jc Diwakar Reddy

Jc Diwakar Reddy

సీమ నేతల్లో ఏకాభిప్రాయం కరువు..

అయితే రాయల తెలంగాణ వాదనపై సీమ నేతల్లోనే ఏకాభిప్రాయం కనిపించడం లేదు. జేసీ వంటి సీనియర్ నేత రాయల్ తెలంగాణ అంటూ ఉంటే… గత కొన్నేళ్లుగా రాయల సీమ హక్కుల పేరిట ఉద్యమం చేస్తున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం ఆ వాదననే కొట్టి పారేస్తున్నారు. రాయలసీమను విడదీసే దమ్ము, ధైర్యం ఎవ్వరికీ లేదన్నారు.గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నది ఆయన డిమాండ్. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కూడా రాయలసీమలో కలిపి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చెయ్యాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. ఏపీతో కలిసి ఉండటం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మా నీళ్లు-మా నిధులు అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం బైరెడ్డి గళం విప్పుతున్నారు.

అయితే నెల్లూరు-ప్రకాశం జిల్లాలను రాయలసీమలో కలపాలన్న భైరెడ్డి డిమాండ్‌ను కొట్టి పారేస్తున్నారు నెల్లూరు జిల్లా విద్యార్థి సంఘాల నేతలు. తమ భాష, యాస, కట్టుబాట్లు, అలవాట్లు అన్నీ వేరని…తమను రాయలసీమలో కలపడమేంటన్నది వారి వాదన.

అటు జేసీ వాదనకు- ఇటు బైరెడ్డి వాదనకు భిన్నంగా స్పందిస్తున్నారు మరి కొంత మంది సీమ సీనియర్ నేతలు. అందులో మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి ఒకరు. రాష్ట్ర విభజన సమయంలోనే రాయల తెలంగాణ ఏర్పాటు కావాల్సి ఉండేదని, అప్పుడు సాధ్యం కాలేదు కనుక.. ఇప్పుడదని సాధ్యమవుతుందన్న నమ్మకం తనకు లేదని చెప్పుకొచ్చారు.

Byreddy Rajasekhar Reddy

Byreddy Rajasekhar Reddy

రాయల తెలంగాణ డిమాండ్ బూటకం: మాజీ మంత్రి దానం

జేసీ డిమాండ్ చేసినట్టు… రాయల తెలంగాణ ఏర్పాటుకు తెలంగాణ నేతలు సిద్ధంగా ఉన్నారా..? ఆయనైతే తాను స్వయంగా కేసీఆర్‌తోనే మాట్లాడనని, ఆయన అనుకూలంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక్కడ జేసీ వాదన ఎలా ఉన్నా… బీఆర్ఎస్ నేతలు మాత్రం రాయల తెలంగాణ అంశాన్ని కొట్టి పారేస్తున్నారు. నిజానికి విభజన సమయంలో కూడా అదే జరిగింది. అప్పుడు కూడా మెజార్టీ తెలంగాణ నేతలు రాయల తెలంగాణకు ససేమిరా అన్నారు. ఇప్పుడు కూడా వారు అదే వాదనను వినిపిస్తున్నారు. జేసీ తెచ్చిన రాయల తెలంగాణ వాదన ఓ బూటకమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత  దానం నాగేందర్‌ కొట్టిపారేశారు.

ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలే కారణం: మంత్రి జగదీశ్

అటు మంత్రి జగదీశ్ రెడ్డిది అదే మాట. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే రాయల తెలంగాణ వాదం తెరపైకొస్తోందని అన్నారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ రెండూ సాధ్యం కాని విషయాలని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారన్నది జగదీశ్ రెడ్డి మాట.

ఎవరుపడితే వాళ్లు మాట్లాడితే స్పందించం..: మంత్రి తలసాని

రాయల తెలంగాణ అంటూ ఎవరు పడితే వాళ్లు మాట్లాడితే తాము లెక్కలోకి తీసుకోమని మంత్రి తలసాని అన్నారు. జెసి దివాకర్ రెడ్డి కాదు ఆయన పార్టీ అధ్యక్షున్ని ఈ మాట చెప్పమనండి అంటూ ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం ప్రజలు మర్చిపోయిన అంశాలను అప్పుడప్పుడు తీసుకురావడం వాళ్లకు కామన్‌గా మారిపోయిందన్నారు. రాయలసీమ కోసం అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలు పోరాడితే అప్పుడు స్పందిస్తమన్నారు.

సో… తెలుగు రాష్ట్రంలో మళ్లీ రాజుకుంటున్న విభజన చిచ్చు ఇది. అయితే రాయలసీమ అభివృద్ధి పేరిట మాట్లాడుతున్న సీమ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు.. భిన్న వాదనలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ వేడి.. ఈ డిమాండ్లు.. ఇలాగే మున్ముందు కొనసాగుతాయా..? లేదా.. అన్నది వేచి చూడాల్సిందే..

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..