AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మర్డర్ కేసులో కూపీ లాగితే.. వెలుగులోకి నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!

నెల్లూరులో సంచలనం సృష్టించిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో సీపీఎం నాయకుడు పెంచలయ్య అనే వ్యక్తిని దాదాపు పదిమంది కత్తులతో నరికి చంపారు. ఆ సమయంలో ఇది రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాల కారణంగా పాత కక్షలతో జరిగిన హత్య అని అందరూ అనుకున్నారు.

మర్డర్ కేసులో కూపీ లాగితే.. వెలుగులోకి నెల్లూరు 'నేర' జాన కామాక్షి అరాచకాలు..!
Kamakshi Criminal Empire
Ch Murali
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 03, 2025 | 9:07 AM

Share

నెల్లూరులో సంచలనం సృష్టించిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో సీపీఎం నాయకుడు పెంచలయ్య అనే వ్యక్తిని దాదాపు పదిమంది కత్తులతో నరికి చంపారు. ఆ సమయంలో ఇది రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాల కారణంగా పాత కక్షలతో జరిగిన హత్య అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాతే ఒక్కొక్క విషయం బయటపడుతూ షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నెల్లూరులో అప్పటిదాకా ఎవరూ ఊహించని ఓ మహిళ నెలకొల్పిన నేర సామ్రాజ్యం తాలూకు వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. అది కూడా మహిళలు నెలకొల్పిన నేర సామ్రాజ్యాలు బయటపడుతున్నాయి. తరచూ ప్రజలు ఉలిక్కిపడే ఘటనలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ శ్రీకాంత్ అతని ప్రియురాలు నిడగుంట అరుణ వ్యవహారం మరిచిపోకముందే, మరో లేడీ డాన్ వ్యవహారం బయటకు వచ్చింది. ఐదు రోజుల క్రితం జరిగిన పెంచలయ్య హత్య కేసులో కూపీ లాగిన పోలీసులకు అరవ కామాక్షి అనే మహిళ ఆగడాలను పోలీసులు గుర్తించారు.

నెల్లూరు నగరంలోని బోడిగానితోటలో నివాసం ఉంటున్న అరుణ గంజాయి దందా నిర్వహిస్తోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అరవ కామాక్షికి వంశపారపర్యంగా ఆస్తులు సంక్రమించినట్లు నేర ప్రవృత్తి కూడా అలాగే వచ్చినట్లు తేలింది. ఆమె తల్లిదండ్రులు గతంలో ఈ రకమైన దందాలు ముఠా ఏర్పాటు చేసుకుని దాడులు, దోపిడీలకు పాల్పడే చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నగరంలో వీధుల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరుకుని అమ్ముకునే వృత్తిలో ఉంటున్న చిన్నపిల్లలను చేరదీసేది. వారి ద్వారా జూనియర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల వద్ద చివరకు పాఠశాల వద్ద విద్యార్థులకు గంజాయి అమ్మకాలు చేయిస్తున్నట్లు తేలింది.

నెల్లూరు నగరంలోని 14 విద్యాసంస్థల వద్ద కామాక్షికి చెందిన వ్యక్తులు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వందలాది మంది విద్యార్థులు కామాక్షి చేస్తున్న దందాలో చిక్కుకున్నారు. విద్యార్థులు గంజాయి సేవించేవారని తెలియడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యా సంస్థల వద్ద నిత్యం సంచరించే అనుమానిత వ్యక్తుల పట్ల పోలీసులు నిఘా ఉంచారు. ఒక నెల్లూరు నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు గంజాయి విక్రయించే ముఠాలకు కామాక్షి పెద్ద మొత్తంలో గంజాయి సరఫరా చేసేదని తెలుస్తోంది.

ఒరిస్సా నుంచి నిత్యం పెద్ద మొత్తంలో గంజాయి నెల్లూరుకు తీసుకు వచ్చి జిల్లాలోని పలు ప్రాంతాలకు, అలాగే చెన్నై నగరానికి కూడా తరలించేదని విచారణలో తేలింది. నెల్లూరు నగరంలోని స్లమ్ ఏరియాల నుంచి యువతను చేరదీసి తన దందాలో భాగస్వామ్యాలుగా చేసిన కామాక్షిపై గతంలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరాలు తెలిపిన వారిపై దాడులు, బెదిరింపులతో తన దందాను సాగించేదని తెలుస్తోంది. పెంచలయ్య హత్యతో అదుపులోకి తీసుకుని విచారించగా కామాక్షి నేరసామ్రాజ్యానికి సంబంధించిన షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..