Polavaram Politics: ఎత్తుకు పై ఎత్తు.. పోలవరంపై మళ్లీ రాజకీయ రగడ.. వైసీపీ వర్సెస్ కూటమి సర్కార్..
పోలవరంపై మళ్లీ ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. నవంబర్ 6న విదేశీ బృందం వస్తున్న నేపథ్యంలో పోలవరంపై పాలిటిక్స్ హీటెక్కాయి. ప్రభుత్వ తీరుపై వైసీపీ విమర్శలు.. వాటికి అధికారపక్షం కౌంటర్లతో పొలిటికల్ వార్ మొదలైంది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ విషయంలో అసలేం జరుగుతోందో ఓ సారి చూడండి..
పోలవరం.. ఏపీకి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీ రూపురేఖలే మారిపోతాయనేది నాయకులు చెప్తున్న మాట. అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎప్పుడూ రాజకీయం నడుస్తూనే ఉంటోంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా రాజకీయం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో నేతల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ ప్రాజెక్ట్ ఎత్తు విషయం చర్చనీయాంశంగా మారింది.
ఎత్తు తగ్గిస్తే తాగు, సాగునీటి అవసరాలకు తీవ్ర విఘాతం
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబుకు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్ట్ మారిందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించి ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే తాగు, సాగునీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. నిధులను కూడా దారిమళ్లించి.. ప్రాజెక్ట్‌కు చంద్ర గ్రహణం పట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.
45.72 మీటర్ల ఎత్తుతోనే నదుల అనుసంధానం సాధ్యం
అయితే, పోలవరం ఎత్తు తగ్గింపు అనేది అబద్ధమంటోంది టీడీపీ. నదుల అనుసంధానం చేయడమే చంద్రబాబు పాలసీ అని అంటున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం 45.72 మీటర్ల ఎత్తుతోనే నదుల అనుసంధానం సాధ్యమంటున్నారు మంత్రి నిమ్మల.
పొరపాటు చేస్తే తిరుగుబాటు తప్పదు -సీపీఐ రామకృష్ణ
ప్రభుత్వం ఎన్ని చెప్పినా పోలవరం విషయంలో మాత్రం దగా జరుగుతోందన్నారు సీపీఐ నేత రామకృష్ణ. పోలవరం, స్టీల్‌ప్లాంట్ విషయంలో పొరపాటు చేస్తే తిరుగుబాటు తప్పదన్నారు. ప్యాకేజీ విషయంలో నిర్వాసితులకు అన్యాయం చేస్తే పోరాటం చేస్తామంటున్నారు.
అటు.. ప్రభుత్వం మాత్రం పోలవరం నిర్మాణంపై ముందుకే చూస్తోంది. నవంబర్ 6 నుంచి విదేశీ బృందం అక్కడే మకాం వేసి, ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్, పనుల నాణ్యత, సాంకేతిక సవాళ్లపై మేధోమథనం చేయబోతోంది. నవంబర్ రెండో వారంలో సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శించి, నిర్మాణ చర్యలపై ఆరా తీస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..