AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏందబ్బా.. నాటు కోడి గుడ్డ ధర ఐదొందలా..? అంత రేటు ఎందుకంటే..?

పోలవరం జిల్లాకు చెందిన రైతు దన్నూరి శ్రీనివాస్, 15 ఎకరాల్లో మిర్చి సాగుతో పాటు, ఇంటి పెరట్లో నాటుకోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం పొందుతున్నారు. మేలుజాతి కోళ్లను పెంచుతూ, ఒక్కో గుడ్డును రూ. 500కు, కోడిని రూ. 20 వేల వరకు విక్రయిస్తూ అద్భుతమైన సంపాదన ఆర్జిస్తున్నారు.

ఏందబ్బా.. నాటు కోడి గుడ్డ ధర ఐదొందలా..? అంత రేటు ఎందుకంటే..?
Country Chicken Farming
Ram Naramaneni
|

Updated on: Aug 17, 2026 | 3:40 PM

Share

ఏజెన్సీ ప్రాంతాల రైతులు కష్టాన్ని నమ్ముకుని వ్యవసాయం సాగిస్తారు. అలాంటి వారిలో ఒకరైన పోలవరం జిల్లా, కూనవరం మండలం, గొమ్ము అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన దన్నూరి శ్రీనివాస్, కేవలం వ్యవసాయం మీదే కాకుండా అనుబంధ రంగాల్లో కూడా రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సుమారు 15 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తూనే, తన ఇంటి పెరటిలోని ముప్పావు ఎకరం స్థలాన్ని వినియోగించుకుని మేలు జాతి నాటుకోళ్ల పెంపకంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఈయన పెంచుతున్న కోళ్ల గుడ్డు ధర రూ. 500 కాగా, పూర్తిస్థాయి పుంజు ధర రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు పలుకుతుంది. శ్రీనివాస్ ప్రస్తుతం సుమారు 200 మేలు జాతి నాటుకోళ్లను పెంచుతున్నారు.

కోళ్ల పెంపకంలో ఆయన అనుసరిస్తున్న పద్ధతులు ప్రత్యేకమైనవి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న జాతులను ఎంపిక చేసుకుని, ఇతర జిల్లాల నుంచి వాటిని తీసుకువచ్చి, బ్రీడర్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ బ్రీడర్ల నుంచి నాణ్యమైన కోడి పిల్లలను ఉత్పత్తి చేయడమే ఆయన లక్ష్యం. కోళ్ల పెంపకంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, రాగులు, సజ్జలు వంటి సహజమైన మేతను అందిస్తారు. అలాగే, వాటి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ, పిల్లులు వంటివి రాకుండా చుట్టూ ఫెన్సింగ్, నెట్ ఏర్పాటు చేశారు. కోళ్ల ఆరోగ్య పరిరక్షణకు, జబ్బులు రాకుండా తగిన మందులు, మెడిసిన్‌లను తన కుమారుల సాయంతో అందిస్తున్నారు. శ్రీనివాస్ కోళ్ల జీవిత చక్రంలోని ప్రతి దశలోనూ అత్యంత శ్రద్ధ వహిస్తారు. గుడ్డు దశ నుంచి పిల్లలుగా, పిల్లల నుండి పుంజులుగా, అక్కడి నుంచి వయసుకు వచ్చిన కోళ్లుగా మారేవరకు ప్రత్యేక సంరక్షణను అందిస్తారు. ఒక గుడ్డు ధర రూ. 500కు విక్రయిస్తుండగా, 10 రోజుల కోడి పిల్ల రూ. 1,000 వరకు ఉంటుంది. 20 నుంచి 30 రోజుల వయసున్న కోడి పిల్లలు రూ. 2,000కు అమ్ముడవుతాయి. కూత పట్టిన పట్టా పుంజులు రూ. 10,000 నుంచి లభిస్తుండగా, తయారైన పుంజులు వాటి దెబ్బలాడే సామర్థ్యం (ఫైటింగ్ క్వాలిటీ) ఆధారంగా రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు ధర పలుకుతాయి.

ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండుగల సమయాల్లో ఈ నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. గత నాలుగు-ఐదేళ్లుగా ఈ పెంపకం చేస్తున్న శ్రీనివాస్, దీనిని ఒక హాబీగా, మిర్చి సాగు ఒత్తిడిని తగ్గించుకునే మార్గంగా చూస్తారు. ఉదయం కోళ్ల వద్దకు వచ్చి మేత వేసి, వాటితో కొంత సమయం గడపడం ద్వారా వ్యవసాయ పనుల టెన్షన్లను మర్చిపోతానని ఆయన చెబుతారు. వ్యవసాయంతో పాటు చిన్నపాటి స్థలంలో నాటుకోళ్ల పెంపకం వంటి అనుబంధ ఆదాయ మార్గాలను ఎంచుకుంటే ఆర్థికంగా ఎదగవచ్చని దన్నూరి శ్రీనివాస్ నిరూపిస్తున్నారు. ఈయన ప్రయోగం ఏజెన్సీ ప్రాంతంలోని ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us