AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆషాడం తర్వాత అత్తారింటికి కొత్త అల్లుడు.. అడుగడుగుకో గిఫ్ట్.. వీడియో చూడండి..

ఆషాడ మాసం ముగిసిన తర్వాత అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘన స్వాగతం లభించింది. ఇంటి గేటు నుంచి గడప వరకు అడుగుకో బహుమతి అందించడంతో పాటు.. డైనింగ్ టేబుల్‌పై ఏకంగా వంద రకాల వంటకాలు సిద్ధం చేసి అత్తమామలు అల్లుడికి అదిరిపోయే మర్యాదలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Andhra: ఆషాడం తర్వాత అత్తారింటికి కొత్త అల్లుడు.. అడుగడుగుకో గిఫ్ట్.. వీడియో చూడండి..
Son In Law Hospitality
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 3:21 PM

Share

మన భారతీయ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లి తర్వాత ఆడపిల్లను అత్తారింటికి పంపించినా.. పండగలు, పర్వదినాలు, శుభకార్యాల సమయంలో కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి ఘనంగా మర్యాదలు చేయడం మన సంస్కృతిలో భాగం. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అల్లుడి మర్యాదలకు ఉండే ప్రత్యేకతే వేరు. సంక్రాంతి సమయంలో చేసే అల్లుడి మర్యాదలు ఎంత ఫేమస్సో.. ఆషాడ మాసం ముగిసిన తర్వాత కొత్త అల్లుడికి చేసే ఆతిథ్యం కూడా అంతే ప్రత్యేకం.

ఇప్పటివరకు కోనసీమ అల్లుడి మర్యాదల గురించి ఎక్కువగా విన్నాం. కానీ.. మేమేమీ తక్కువ కాదు అంటూ అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ కుటుంబం చేసిన ఆషాడం అల్లుడి మర్యాదలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొత్త అల్లుడు శ్రీహర్షకు అత్తింటివారు ఇచ్చిన ఆతిథ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆషాడ మాసం ముగియడంతో శ్రీహర్ష నర్సీపట్నంలోని అత్తవారింటికి వెళ్లాడు. అల్లుడికి అత్తమామలు ఘన స్వాగతం పలికారు.

ఇక అసలు మర్యాదలు అప్పుడే మొదలయ్యాయి. ఇంటి గేటు నుంచి గడప దాటి లోపలికి వెళ్లే వరకు.. ప్రతి అడుగుకూ ఒక బహుమతి అందిస్తూ అల్లుడిని ఆహ్వానించారు. వెండితో చేసిన దేవతామూర్తులు, ఛార్జింగ్ ఫ్యాన్, పెన్ను, సెంటు సీసా, పర్సు.. ఇలా ఒక్కో అడుగుకు ఒక్కో గిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కోసం అల్లుడిని ప్రత్యేకంగా ఆహ్వానించి.. కళ్లకు గంతలు కట్టారు. నెమ్మదిగా డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లి గంతలు విప్పగానే.. అక్కడ కనిపించిన వంటకాలతో శ్రీహర్ష ఆశ్చర్యపోయాడు.

ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి టిఫిన్లతో పాటు రకరకాల మిఠాయిలు, జ్యూస్‌లు, పానీయాలు.. ఇలా ఏకంగా వంద రకాల ఆహార పదార్థాలను టేబుల్‌పై సిద్ధం చేశారు. ఇన్ని రకాల వంటకాలు చూసిన అల్లుడు తొలుత సిగ్గుపడినా.. భార్య నవ్యతో పాటు అత్తమామలు మాత్రం వదల్లేదు. కొసరి కొసరి వడ్డిస్తూ వీలైనన్ని రకాల వంటకాలను రుచి చూపించారు. దీంతో అల్లుడు శ్రీహర్ష కూడా తన వంతుగా ఆతిథ్యానికి న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఆషాడం అల్లుడు వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న బంధువులు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇంట్లో సందడి నెలకొంది.

అడుగుకో బహుమతి.. టేబుల్‌పై వంద రకాల వంటకాలు.. బంధువుల సందడి.. ఇలా నర్సీపట్నంలో జరిగిన ఈ ఆషాడం అల్లుడి మర్యాదలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘కోనసీమ అల్లుడి మర్యాదలకు ఏమాత్రం తీసిపోని రీతిలో చేశారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వీడియో దిగునవ చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us