AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: “నా బిడ్డకు బతుకునిచ్చారు సారూ.. మీరే పేరు పెట్టండి”

కుమార్తెకు పునర్జన్మనిచ్చిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌కు ఓ తల్లిదండ్రులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారికి రూ.14 లక్షల ఆర్థిక సహాయం అందేలా కమిషనర్ అభిషేక్ అగస్త్య కృషి చేయడంతో జూలై 28న విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.

Khammam: నా బిడ్డకు బతుకునిచ్చారు సారూ.. మీరే పేరు పెట్టండి
Municipal Commissioner Abhishek Agastya
N Narayana Rao
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 2:57 PM

Share

ఒక తండ్రి తన కుమార్తెను తొలిసారి ఎత్తుకున్నప్పుడు కలిగిన ఆనందం.. ఆ చిన్నారి గుండెకు వ్యాధి ఉందని తెలిసిన క్షణంలో ఆవిరైపోయింది. వైద్యం చేయించాలంటే లక్షల రూపాయలు అవసరం. ఏం చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ సమయంలో ఒక అధికారి చూపిన మానవత్వం ఆ చిన్నారి జీవితాన్నే మార్చేసింది. తమ బిడ్డకు పునర్జన్మనిచ్చిన ఆ అధికారికి ఆ తల్లిదండ్రులు ఊహించని రీతిలో కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం నగరానికి చెందిన కాంపాటి రాకేష్, మాధవి దంపతులకు మే 9న ఆడబిడ్డ జన్మించింది. పుట్టిన పసికందును చూసుకుని ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. పుట్టిన 12 రోజులకే చిన్నారికి గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్సకు భారీగా ఖర్చవుతుందని తెలియడంతో ఆ కుటుంబం ఆందోళనకు గురైంది. కుటుంబ పరిస్థితిని చూసి చిన్నారి నానమ్మ నరసమ్మ కూడా తీవ్రంగా కలత చెందారు. ఖమ్మం నగరపాలక సంస్థలో శానిటేషన్ విధులు నిర్వహిస్తున్న ఆమె.. తమ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య దృష్టికి తీసుకెళ్లారు.

చిన్నారి పరిస్థితి గురించి తెలుసుకున్న కమిషనర్.. సమస్యను కేవలం ఒక ఫిర్యాదుగా చూడలేదు. ఓ చిన్నారి ప్రాణాలతో ముడిపడిన అంశంగా భావించి వెంటనే స్పందించారు. హృదయ స్వచ్ఛంద సంస్థతో పాటు ప్రభుత్వ సహకారంతో రూ.14 లక్షల ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు. ఆ సహాయంతో జూలై 28న చిన్నారికి గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడిన చిన్నారి ప్రస్తుతం ఆరోగ్యంగా కోలుకుంటోంది. తమ బిడ్డను తిరిగి తమ ఒడిలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కమిషనర్‌ను తల్లిదండ్రులు జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తిగా భావించారు.

అందుకే తమ కృతజ్ఞతను మాటల్లో చెప్పడం మాత్రమే కాకుండా.. తమ కుమార్తెతోనే వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి చిన్నారిని తీసుకొచ్చిన రాకేష్, మాధవి దంపతులు కమిషనర్‌ను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమార్తెకు పునర్జన్మనిచ్చిన ఆయన చేతుల మీదుగానే చిన్నారికి పేరు పెట్టాలని కోరారు. ఆ తల్లిదండ్రుల కోరికను విన్న కమిషనర్ అభిషేక్ అగస్త్య సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారికి ‘జస్విక శ్రీ’ అని నామకరణం చేశారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఓ అధికారి చేసిన సకాలపు స్పందన.. ఓ కుటుంబానికి ఆశను ఇచ్చింది. ఆర్థిక సహాయం అందించడం కంటే మించి, తమ బిడ్డను కాపాడేందుకు తోడుగా నిలిచిన వ్యక్తికి ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను పరిచయం చేస్తూ కృతజ్ఞతలు చెప్పిన తీరు అక్కడున్న వారిని కదిలించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us