AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: కావేరీ నదీ జలాల వివాదం.. కర్ణాటకకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

కావేరీ నదీ జలాల విడుదల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థ (CWMA) ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడుకు నీటి విడుదలపై తాజా పరిస్థితిని పరిశీలించేందుకు విచారణను ఒక వారం పాటు వాయిదా వేస్తూ, తదుపరి విచారణను ఆగస్టు 24వ తేదీకి ఖరారు చేసింది.

Supreme Court: కావేరీ నదీ జలాల వివాదం.. కర్ణాటకకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
Cauvery Water Dispute
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 2:28 PM

Share

కావేరీ నదీ జలాల విడుదల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడుకు నీటి విడుదల విషయంలో CWMA జారీ చేసిన ఆదేశాలను కర్ణాటక కచ్చితంగా పాటించాలని సూచించిన ధర్మాసనం, తాజా పరిస్థితులపై స్టేటస్ రిపోర్ట్‌ సమర్పించాలని కావేరీ అథారిటీని ఆదేశించింది. జలాశయాల్లో నీటి నిల్వ, ప్రస్తుత ప్రవాహం, తమిళనాడుకు విడుదల చేస్తున్న నీటి పరిమాణం తదితర పూర్తి వివరాలతో తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆగస్టు 12, 13 తేదీల నుంచి 15 రోజుల పాటు రోజుకు 12,000 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని CWMA ఇచ్చిన ఆదేశాల అమలుపై ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

మా వాటా మాకు దక్కాల్సిందే: తమిళనాడు

తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదిస్తూ.. CWMA ఆదేశాలు ఉన్నప్పటికీ తమిళనాడుకు తగినంత నీరు అందడం లేదని, ఫలితంగా రైతులకు సాగునీరు విడుదల చేయలేకపోతున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. కర్ణాటక జలాశయాల్లో 76 శాతం నీటి నిల్వ ఉన్నప్పటికీ, ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రావాల్సిన 64 టీఎంసీలకు గాను కేవలం 14 టీఎంసీల నీరు మాత్రమే అందిందని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని కర్ణాటక తన వద్దే ఉంచుకోకూడదని, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దామాషా ప్రకారం తమిళనాడుకు దక్కాల్సిన వాటా నీటిని విడుదల చేయాలని కోరారు.

 ప్రవాహం పెరిగింది.. నిబంధనలు ఉల్లంఘించలేదు: కర్ణాటక

కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తూ.. కావేరీ పరీవాహక ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, జలాశయాల్లో భారీగా నీటి కొరత నెలకొందని పేర్కొన్నారు. CWMA అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆదేశాలు జారీ చేసిందన్నారు. మొదటి ఆదేశం ప్రకారం బిలిగుండులు వద్ద 3,500 క్యూసెక్కుల ప్రవాహాన్ని నిర్ధారించాల్సి ఉండగా, తొలినాళ్లలో తక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత లభ్యత గణనీయంగా పెరిగిందని తెలిపారు.

తాజా 12,000 క్యూసెక్కుల నీరు బిలిగుండులు చేరుకోవడానికి సుమారు 48 గంటల సమయం పడుతుందని, ఈరోజు ఉదయం 8 గంటల సమయానికి ప్రవాహం 12,607 క్యూసెక్కులకు చేరి CWMA నిర్దేశించిన స్థాయిని దాటిందని వివరించారు. గేట్లు తెరిచి నిర్దేశిత ప్రవాహాన్ని కొనసాగిస్తున్నామని, తమిళనాడు చేస్తున్న నిబంధనల ఉల్లంఘన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

తదుపరి విచారణ ఆగస్టు 24కు వాయిదా

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. CWMA ఆదేశాలను కర్ణాటక యథాతథంగా అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రస్తుతం తమిళనాడులో తగినంత నీరు అందుబాటులో ఉన్నందున తక్షణమే ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించింది. తాజా నీటి విడుదల స్థితిగతులను వారం తర్వాత సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. రెండు రాష్ట్రాల నీటి నిల్వలు, వర్షపాతం, హైడ్రోలాజికల్ డేటాను ఆగస్టు 24న జరిగే విచారణలో సుప్రీంకోర్టు సమగ్రంగా పరిశీలించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us