Hyderabad: జాబ్ కోసమని హైదరాబాద్ వచ్చాడు.. కల నేరవేరకుండానే ఇలా..
హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వేగంగా వచ్చిన ఓ యువకుడు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అప్ప జంక్షన్ వద్ద బైక్ అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు జగిత్యాల జిల్లాకు చెందిన వికాస్‌గా గుర్తించారు.

సాయంత్రం బయటకు వెళ్లొస్థానని చెప్పి ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల ప్రాంతానికి చెందిన బండా వికాస్ ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. అయితే ఉద్యోగం కోసమని హైదరాబాద్ వచ్చిన వికాస్ సన్‌సిటీలో తన మిత్రులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అయితే ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన వికాస్.. అప్ప జంక్షన్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల కారణంగా వికాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదాన్ని గమనించిన వాహనదారులకు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న నార్సింగి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే కొడుకు మరణవార్త విన్న వికాస్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సిటీకి వెళ్లి కొడుకు.. ఉద్యోగం చేసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తాడు అనుకుంటే.. ఏకంగా తిరిగిరాని లోకాలకే వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
