అనతంపురం(Anantapur) జిల్లా కళ్యాణదుర్గం ప్రజలకు ఎలుగుబంట్ల భయం పట్టుకుంది. ఎలుగుబంట్ల సంచారంతో కంటి మీద కునుకు లేకుండా పోతోందని కళ్యాణదుర్గం మండలం ముదిగల్లు వాసులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా జంట ఎలుగుబంట్ల సంచారంతో ఇక్కడి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అటవీ ప్రాంతంలో చెట్లు నరికి వేయడం వల్ల అవి జనావాసంలోకి వస్తున్నాయి. ఎలుగుబంట్ల(Bears) సంచారంపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. అటవీశాఖ అధికారులు మాత్రం అలాంటిదే ఏం లేదని, ఎలుగుబంట్లు తరచూ తమ స్థావరాలను మార్చుకుంటాయని అంటున్నారు. అయితే ప్రజలకు తాము రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎలుగుబంట్ల బారి నుంచి తమను కాపాడాలని ముదిగల్లు ప్రజలు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి, ఎలుగుబంటిని పట్టుకోవాలని కోరుతున్నారు, గిరిజనులు. ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రస్తుతం సూర్యనగర్ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని చెబుతున్నారు.
మరోవైపు.. ఉత్తరాంధ్రలో ఎలుగుబంట్ల సంచారం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా మన్యం జిల్లాను ఎలుగుబంట్లు వణికిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబండి ఘటన మరవక ముందే, మరో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. గురువారం కురుపాం మండలం సూర్యనగర్‌లో ఎలుగుబంటి కలకలం రేపింది. దీంతో అక్కడి ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు, ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. పొలాల దగ్గరకు వెళ్లినప్పుడు ఎలుగుబంటిని చూశామని, ఇప్పుడు పొలం పనులకు వెళ్లాలంటేనే భయంగా ఉందన సూర్యనగర్ వాసులు చెబుతున్నారు.