Pawan Kalyan: స్వయంగా తానే ఇంటికెళ్లి.. వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

అమ్మా నీ పెద్ద కొడుకుని వచ్చా.. నిన్ను చూడడానికి వచ్చా.. బాగున్నావా.. నీ ఆరోగ్యం ఎలా ఉంది.. నాలుగు రోజులుగా నిన్ను చూసేందుకు వద్దామంటే వీలుపడలేదు.. నీకిచ్చిన మాట కోసం ఈ రోజు పనులన్నీ వాయిదా వేసుకుని వచ్చా అంటూ మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమెను ఆప్యాయంగా పలకరించారు.

Pawan Kalyan: స్వయంగా తానే ఇంటికెళ్లి.. వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
Pawan Kalyan Ippatam Visit

Updated on: Dec 24, 2025 | 4:16 PM

గత ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న అక్కసుతో ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతల సమయంలో గత పాలకుల దాష్టికాలకు ఎదురు నిలచిన శ్రీమతి నాగేశ్వరమ్మ.. నా బిడ్డ శ్రీ పవన్ కళ్యాణ్ వస్తారు.. మీ బెదిరింపులకు భయపడం అంటూ రోడ్డెక్కారు. దీంతో నాడు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి అందరికీ భరోసా ఇచ్చారు. నాగేశ్వరమ్మ ఇంటి కొడుకుగా అండగా నిలుస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే గెలిచిన తరవాత తన ఇంటికి రావాలని నాగేశ్వరమ్మ పవన్‌ను కోరారు. ఆమెకు ఇచ్చిన మాట మేరకు బుధవారం నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలుకరించారు.

సంక్రాంతికి చీర, ఖర్చులకు రూ. 50 వేల ఆర్థిక సాయం

ఆ ఇంటికి కుమారుడిగా నాగేశ్వరమ్మ గారికి సంక్రాంతి పండుగ కానుకగా చీర బహూకరించారు. ఖర్చుల నిమిత్తం మరో రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. దివ్యాంగుడైన నాగేశ్వరమ్మ మనుమడు మనోజ్ సాయి చదువుల నిమిత్తం రూ. లక్ష సాయం చేశారు. ఆమె కుమారుడు శ్రీ కొండయ్య క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3 లక్షలు ఇచ్చారు. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఇవి కూడా చదవండి

అద్యంతం ప్రజల్లో మమేకం.. పూలవర్షంతో స్వాగతించిన జనం

పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటనకు వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు ఆయనకు దారి పొడవునా పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. కొలనుకొండ, ఇప్పటం గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నిలబడి హారతులు పడుతూ, పూల వర్షం కురిపించారు. ఇప్పటం నుంచి తిరుగు ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకం అయ్యారు. పూలతోటల్లో పని చేస్తున్న కూలీలను పలుకరించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.