AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీని మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం.. వైసీపీపై యుద్ధం ప్రకటించిన పవన్, బాబు..

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాన్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరుగగా.. భేటీ అనంతరం ఇద్దరూ కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

Andhra Pradesh: ఏపీని మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం.. వైసీపీపై యుద్ధం ప్రకటించిన పవన్, బాబు..
Pawan Kalyan And Chandrababu
Shiva Prajapati
|

Updated on: Jan 08, 2023 | 3:09 PM

Share

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాన్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరుగగా.. భేటీ అనంతరం ఇద్దరూ కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని నిర్ణయించిన ఈ ఇద్దరు నేతలు.. సర్కార్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఇద్దరు నేతలు ఫైర్ అయ్యారు. పెన్షన్లు తీసేయడం, రైతులు, ప్రజల సమస్యలపై చర్చించామన్నారు. బ్రిటీష్ కాలం నాటి జీవోతో ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని, వైజాగ్‌లో తనను కూడా అడ్డుకున్నారని, కుప్పంలో చంద్రబాబును కూడా అలాగే అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు పవన్. ఈ భేటీలో జీవో నెంబర్ 1 పై ఎలా పోరాడాలనే అంశంపై చర్చించామన్నారు.

ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు కామెంట్స్..

‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? ఇప్పటంలో పవన్‌ అడ్డుకున్నారు. ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. నేను ఎక్కడికి పోయినా అడ్డుకుంటున్నారు. గంజాయి, డ్రగ్స్‌పై పోరాడితే మా ఆఫీస్‌పై దాడి చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. ప్రజా జీవితం అంధకారంగా మారిపోయింది. బ్రిటీష్‌కాలం నాటి జీవోలు తీసుకొస్తారా?. నల్ల జీవో తెచ్చి ఉన్మాదుల్లా వ్యవహరిస్తారా? సొంత నియోజకవర్గంలో నన్ను అడ్డుకుంటారా? మహిళలపై హత్యాయత్నం కేసులు పెడుతారా? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కందుకూరు, గుంటూరు ఘటనలు వైసీపీ కుట్ర. ఈ కుట్రను పోలీసులు అమలు చేశారు. సభలకు అనుమతి ఇవ్వకపోవడం ఏంటి? సినిమా వాళ్లకు కూడా పర్మిషన్లు ఇవ్వరా? ఈ విషయాన్ని అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది గవర్నర్. కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి. ఏపీలో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితి ఉంది’ అని వైసీపీ సర్కార్ విధానాలపై నిప్పులు చెరిగారు చంద్రబాబు.

ఎన్నికలపై తరువాత చర్చలు..

ఎన్నికలు, పొత్తులపై తరువాత చర్చిస్తామని చెప్పారు చంద్రబాబు. అన్ని పార్టీలు,సంఘాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చాలా పొత్తులు పెట్టుకుంటామని, రాజకీయ సమీకరణలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నారు. 2009లో టీఆర్ఎస్ తోనే పొత్తుపెట్టుకున్నామని గుర్తు చేసిన చంద్రబాబు..ఏది ఎప్పుడు చేయాలనేదానిపై వ్యూహాలుంటాయని పేర్కొన్నారు.

పవన్ కామెంట్స్..

‘రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేశాం. మళ్లీ ఏపీ అభివృద్ధిని పట్టాలెక్కించే బాధ్యత తీసుకుంటాం. ఈ రోజు కేవలం జీవోనెంబర్‌-1పై మాత్రమే చర్చించాం. రాష్ట్రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయద్దని ప్రభుత్వం చెప్పింది. కానీ, జగన్‌ పుట్టిన రోజున మాత్రం అన్ని చోట్లా ఫ్లెక్సీలు పెట్టారు. కోవిడ్‌ సమయంలోనూ ఫంక్షన్లు చేశారు. జనాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులదే. సెక్యూరిటీ ఫెయిల్యూర్‌ వల్లే కందుకూరు, గుంటూరు ఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ సంక్షేమ పథకాలు ప్రజలకు నిజంగా అందితే.. గుంటూరు సభకు అంత మంది ఎందుకు వచ్చారు? వైసీపీ అరాచకాలపై బీజేపీతోనూ చర్చిస్తాం. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వం. వైసీపీ నేతలు వారి పాచినోటితో అంతకన్నా ఏం మాట్లాడుతారు. నేను అడుగు తీసి అడుగేస్తే వాళ్లకు ఇబ్బంది అవుతుంది. నేను వారాహి బండి తీసుకుంటే వాళ్లకు ఏంటి ఇబ్బంది? వాళ్లు మాత్రం కోట్లరూపాయలతో వెహికిల్స్‌ తీసుకోవచ్చా?’ వైసీపీ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు పవన్.

ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీని స్వాగతించిన పవన్‌..

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ ఎంట్రీపై జనసేనాని పవన్ స్పందించారు. బీఆర్ఎస్ రాకను ఆయన స్వాగతించారు. భారత రాజ్యాంగం ప్రకారం.. వారికి స్వేచ్ఛ ఉంటుందని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని అన్నారు పవన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..