Andhra Pradesh: పార్వతీపురం మన్యం జిల్లాకు నీతి అయోగ్ అరుదైన గుర్తింపు.. వెంటనే నిధులు మంజూరు
Manyam dist: దేశవ్యాప్తంగా అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన పలు జిల్లాల కలెక్టర్లతో నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ బివిఆర్ సుబ్రహ్మణ్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కావాల్సిన అంశాల పై జిల్లా కలెక్టర్లతో చర్చించారు. అందులో భాగంగా మన్యం జిల్లాలో
పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్11; గిరిజన జిల్లాగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందు కోసం జిల్లాలో ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ హబ్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య, గ్లోబల్ లెవల్ నాలెడ్జ్ తో పాటు పలు అంశాల్లో వారంతట వారే కీలకంగా వ్యవహరించేలా తీర్చిదిద్దాలని సన్నద్దం అయ్యింది. పలు రకాల ప్రాజెక్ట్స్ ఇన్నోవేటివ్ గా రూపొందించడం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, జఠిలమైన సమస్యలను పరిష్కరించడంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాణించేలా శిక్షణ ఇవ్వడమే ఈ ఇన్నోవేషన్ హబ్ ముఖ్య ఉద్దేశ్యం.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గిరి శిఖర ప్రాంతాల్లో ఆర్థిక స్థోమత లేని గిరిజన విద్యార్థులు ఈ హబ్ ద్వారా ప్రయోజనం పొందుతారు. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న సుమారు 2,21,917 మంది విద్యార్థులు ఈ ప్రాజెక్ట్ లో శిక్షణ పొందనున్నారు. విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు జేఎన్టీయూ, ఆంధ్రా యూనివర్సిటీ తదితర ముఖ్య యూనివర్శిటీల నుండి మాస్టర్ ట్రైనర్లను కూడా గుర్తించారు.
ఈ ఇన్నోవేషన్ హబ్ ను పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్ లో భాగంగా జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం మరియు రసాయన శాస్త్ర ప్రయోగశాలల నమూనాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్ ను ఏర్పాటు చేసేందుకు కావల్సిన అన్ని నమూనాలను కొనుగోలు చేసి సుమారు పదిహేను రోజుల్లో ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తుంది.
ఇన్నోవేషన్ హబ్ ప్రతిపాదనకు నీతి ఆయోగ్ ప్రశంసలు..
దేశవ్యాప్తంగా అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన పలు జిల్లాల కలెక్టర్లతో నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ బివిఆర్ సుబ్రహ్మణ్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కావాల్సిన అంశాల పై జిల్లా కలెక్టర్లతో చర్చించారు. అందులో భాగంగా మన్యం జిల్లాలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు ప్రతిపాదనలను నీతి ఆయోగ్ కు తెలియజేశారు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ప్రతిపాదనలు తెలుసుకున్న నీతి అయోగ్ సిఇవో సుబ్రమణ్యం ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని, శభాష్ అంటూ కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ప్రశంసించడంతో పాటు హబ్ ఏర్పాటు కోసం కావాల్సిన మూడు కోట్లు రూపాయల నిధులను వెంటనే మంజూరు చేసింది. అటల్ టింకరింగ్ ల్యాబ్ లోని నీతి ఆయోగ్ జాతీయ స్థాయి ఎగ్జిక్యూటివ్ బృందం ఈ ప్రాజెక్ట్ కు మద్దతు ఇస్తుందని అందుకు నోడల్ అధికారిని కూడా నియమించాలని కోరారు. ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు నీతి ఆయోగ్ నిధులు మంజూరు చేయడం పై జిల్లా అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఇన్నోవేషన్ హబ్ త్వరితగతిన ఏర్పాటు చేసి అమాయక గిరిజన యువత జీవితాల్లో సంచలనాత్మక మార్పులకు తెర లేపాలని ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….