అందాల పోటీలకు చిలక ముక్కు కోళ్ళు రెడీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మీరు సాధారణంగా ఎన్నో రకాల అందాల పోటీలు చూసే ఉంటారు. కోళ్లకు కూడా అందాల పోటీలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో కోళ్లకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. వాటిలో ఉత్తమమైన కోళ్లకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందజేస్తున్నారు. వీటికి కోళ్లకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు.

అందాల పోటీలకు చిలక ముక్కు కోళ్ళు రెడీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Beautiful Cocks
Follow us
Fairoz Baig

| Edited By: Balaraju Goud

Updated on: Jan 03, 2025 | 10:03 AM

వారెవ్వా ఏమీ నోసు.. అచ్చు హీరోయిన్‌లా ఉంది బాసూ..! అంటూ వాటిని చూసి జనం తెగ సంబరపడిపోతారు. అందాల పోటీలు నిర్వహించి మరీ ఆ సొగసరులకు కానుకలు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో వీటికి అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలో అత్యంత అందంగా, మేలు జాతికి చెందినవైతే ఒక్కొక్కటి రూ. 1.20 లక్షల ధర పలుకుతోందట.. ఇంతకీ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

మీరు సాధారణంగా ఎన్నో రకాల అందాల పోటీలు చూసే ఉంటారు. కోళ్లకు కూడా అందాల పోటీలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..? ఈ అందాల పోటీకి వాటిని సుందరంగా, అందంగా సిద్ధం చేయటం ఎప్పుడైనా చూశారా..? కోడి పందాలు చూసాం.. కానీ ఈ అందాల పోటీలు ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా..? అయితే ప్రకాశం జిల్లాలో అందాల పోటీలకు సిద్ధమవుతున్న కోళ్లను చూసేయడమే కాదు.. ఆ కధేంటో, ఆ ముచ్చట ఏంటో..? ఇప్పుడు తెలుసుకుందాం..!

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాషా అందాల పోటీలకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు పాతిక సంవత్సరాల నుంచి చిలక ముక్కు పర్ల కోళ్ల జాతికి చెందిన కోళ్ళను పెంచుతూ వాటిని అందాల పోటీలకు తీసుకెళ్తున్నారు. తన తండ్రి వృత్తిని వారసత్వంగా తీసుకున్న సయ్యద్ బాషా కోళ్లపై మక్కువ పెంచుకున్నాడు. రకరకాల జాతులను పెంచుతూ చివరకు చివరికి దేశంలోనే అరుదైన జాతిలో ఒకటైన పర్లా కోళ్ళు అంటే చిలకమ్మ కోళ్లను పెంచుతూ ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఈ కోడి కి సంబంధించిన గుడ్డు ధరే రూ.1,000 పలుకుతుందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ కోడికి ఉన్న డిమాండ్ ఏంటో..! నెమలిని కోడిని క్రాస్ చేయించడం, జన్యు మార్పిడి వల్ల ఈ కోళ్లు పుడతాయని సయ్యద్ బాషా అంటున్నారు.

నెమలి కోళ్ళే బాడీ బిల్డర్లు..!

ఈ కోళ్లు అచ్చం నెమలిని పోలిన తోకలను కలిగి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒక బాడీ బిల్డర్ ఏ విధంగా తయారవుతాడో, అదే విధంగా పుంజు కోళ్లను అందాల పోటీకి సిద్ధం చేస్తామని చెబుతున్నారు బాషా. వీటికి రాగులు, సజ్జలు, మొక్కజొన్న ఎండు చేపలు ఆహారంగా ఇస్తారు. ఇక అందాల పోటీలకు సిద్ధమయ్యే కోళ్లకు 3 నెలల ముందు నుంచే ఉడకబెట్టిన గుడ్డు, జీడిపప్పు, బాదంపప్పు పెట్టి కోడిని సిద్ధం చేస్తారు. జబ్బుల బారిన పడకుండా కోళ్లకు ముందుగానే మందులు ఇచ్చి కాపాడుకుంటారు. వీటి ముక్కులు ప్రధానం కావడంతో వాటిని జాగ్రత్తగా చూసుకుంటామని అందాల పోటీలలో ఇవే కీలకం అని కోళ్ల సంరక్షకుడు సయ్యద్ భాష చెప్పారు.

ఈ పోటీలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు అయిన అనంతపురం జిల్లా, కేరళ ప్రాంతాలలో అత్యధికంగా జరుగుతాయని పోటీలకు వచ్చే కోళ్లు రూ.30 లక్షలు ధర కూడా పలికేవి ఉంటాయని చెప్పారు. పోటీలలో విజయం సాధించే కోళ్ల యజమానులకు ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, టూవీలర్, బంగారం, వెండి వంటి బహుమతులను బహుకరించి పోటీదారులను ప్రోత్సహిస్తున్నారు. తమ కోళ్లు కూడా గతంలో చాలా బహుమతులు కూడా గెలుచుకున్నట్లు సయ్యద్‌ బాషా తెలిపారు.

రూ. 1.20 లక్షలు పలికే కోడి..!

ప్రస్తుతం తన వద్ద రూ. 1,20,000 విలువచేసే ఒక కోడి పుంజు ఉన్నట్టు తెలిపారు. అలానే అటు ఇటుగా అదే ధరలో ఉన్న మరో రెండు కోడిపుంజులు అందాల పోటీకి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కోడిపెట్ట విలువ 40 నుంచి 60 వేల రూపాయల వరకు ఉంటుందని, నెల వయసు ఉన్న కోడి పిల్ల విలువ 3 నుంచి 5 వేల రూపాయలు వరకు ఉంటుందన్నారు. తన వద్ద కోళ్లు గుడ్లు కొనుగోలు చేసేందుకు ప్రకాశం జిల్లాతో పాటు, అనంతపురం, కర్నూల్, నంద్యాల, కడప జిల్లాల నుంచి అత్యధికంగా పెంపకం దారులు వచ్చి గుడ్లను, కోళ్లను కొనుగోలు చేస్తారని అన్నారు. అంత మొత్తంలో పెట్టి కొనుగోలు చేయలేం అని భావించే వాళ్లకు ఆసక్తిగా కోళ్లను పెంచుకునే వాళ్లకు మాత్రమే గుడ్లను విక్రయిస్తున్నట్లు బాషా తెలిపారు. సంక్రాంతి సమయంలో ఈ కోళ్లకు మరింత డిమాండ్ ఉంటుందని ఇతర దేశాల నుంచి కూడా మన దేశానికి వచ్చి కోళ్ల ప్రేమికులు ఈ కోళ్ల అందాల పోటీలలో ఉత్సాహంగా పాల్గొంటారని సయ్యద్ బాషా అంటున్నారు.

చదివారు కదా అందాల పోటీలకు సిద్ధమయ్యే చిలక ముక్కు కోళ్ళ కథా కమామీషును.. మరి ఇదే అందాల పోటీలకు సిద్ధమవుతున్న కోళ్ల ముచ్చట.. మనుషుల అందాల పోటీల ఏమో కానీ కోళ్ల అందాల పోటీలు మాత్రం యమ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..