
నిత్యకల్యాణం..పచ్చతోరణంగా విలసిల్లే తిరుమల కొండ వరుస వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల లడ్డూ వివాదం బైటపడినప్పటి నుంచి తిరుమల ప్రతిరోజు ఏదో ఒక వివాదంతో వార్తలలో ఉంటుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోరీ తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దొంగను పట్టుకున్నారు. అయితే ఆ దొంగ వెనుకాల ఉంది మీరంటే మీరంటూ వైసీపీ, కూటమి నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. భూమన వర్సెస్ భానుప్రకాష్ అండ్ కిరణ్ రాయల్‌గా ఈ ఎపిసోడ్ టర్న్ తీసుకుంది. పరకామణి పాలిటిక్స్ ఏపీలో కాక రేపుతోంది. తన హయాంలో తప్పు జరిగిందని తెలిస్తే తల నరుక్కుంటానన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి..
తిరుమల పరకామణిలో రవికుమార్ ఓ మఠం తరఫున పనిచేసేవాడు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ.. విదేశీ కరెన్సీని లెక్కించేవాడు. చాలాకాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.. ఈ క్రమంలోనే.. 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ.. అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబుల్లో దాచుకున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయగా విదేశీ కరెన్సీతో పట్టుబడ్డాడు. ఆరోజు అతను 900 డాలర్లు అపహరించగా, అప్పట్లో వాటి విలువ రూ.72 వేలుగా తేల్చారు. ఇలా రవికుమార్ చాలాకాలంగా పరకామణిలో డబ్బులు గుట్టుగా దాచి రూ.కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలున్నాయి. అయితే.. పరకామణిలో చోరీచేస్తూ పట్టుబడిన రవికుమార్ నుంచి కొన్ని ఆస్తులను తిరుమలకు విరాళంగా అందజేయించి, మిగిలిన ఆస్తులను కొందరు వారి పేరిట రాయించుకున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. రవికుమార్ ను పట్టుకున్న తర్వాత లోక్‌అదాలత్‌లో కేసును రాజీ చేయించి, అతడి ఆస్తులను కొట్టేసినట్లు చెబుతున్నారు.
చోరీ చేస్తూ దొరికిన రవికుమార్, అతడి భార్య పేరిట ఉన్న ఆస్తుల్లోని.. తిరుమల దేవస్థానానికి గిఫ్ట్‌డీడ్‌గా ఇప్పించారు. తిరుపతి రూరల్ పరిధిలో ఆస్తులను, అలాగే.. తమిళనాడులో త్యాగరాజనగర్‌లో ని ఆస్తులను తిరుమలకు గిఫ్ట్‌డీడ్‌గా రిజిస్ట్రేషన్ చేయించారు. వీటి విలువ రూ. కోట్లల్లో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. నిందితుడు అరెస్టు కాకుండానే.. రాజీ చేయించి కేసును డీల్ చేసినట్లు ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
పోలీసుల ఒత్తిడితోనే కేసు రాజీ చేయించారని అప్పటి సహాయ విజిలెన్స్, భద్రతా అధికారి (AVSO) చెప్పడం కలకలం రేపింది. అయితే.. తిరుమల పరకామణిలో జరిగిన ఈ రూ.కోట్ల కుంభకోణంలో తెరవెనుక ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు సీఐడీ రంగంలోకి దిగనుంది..
అయితే.. లోక్ అదాలత్ తీర్పుపై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు..పరకామణి వ్యవహారంపై సీఐడీ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్‌లో అందివ్వాలని ఆదేశించింది.
పరకామణిలో చోరీని బయటపెట్టి.. రవికుమార్ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి. 20 ఏళ్లుగా రవికుమార్ పరకామణిలో చోరీ చేస్తున్నాడని, చంద్రబాబు హయాంలో కూడా దొంగతనాలు చేశాడని, అప్పుడు రవికుమార్‌ను చంద్రబాబు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు భూమన. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు భూమన.
ఇదే విషయంపై బిజేపీ నేత భానుప్రకాష్ మాట్లాడతూ.. మరో రెండు రోజుల్లో సంచలన విషయాలు బయటకు వస్తాయన్నారు. సీబీఐ దాకా పనిలేదు, ఎస్సై విచారించినా అన్నీ తెలుస్తాయని భూమనకు కౌంటర్ ఇచ్చారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ బతికి ఉన్నాడో లేదో అనుమానంగా ఉందన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. రవికుమార్ 300 కోట్లు దొంగతనం చేశాడని ఆరోపించారు కిరణ్ రాయల్. రవికుమార్ నుంచి వైసీపీ పెద్ద తలకాయలతో పాటు అధికారులకు కూడా ముడుపులు ముట్టాయని ఆరోపించారు జనసేన నేత.
అయితే తిరుమలలో వెలుగు చూస్తున్న ఈ వరుస వివాదాలు..ఓవైపు రాజకీయ రచ్చ రేపుతుండగా మరోవైపు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. నీరు పల్లమెరుగు.. నిజము దేవుడెరుగు! ఈ మేటర్‌లో చోరుల వెనక ఉన్న అసలు వ్యక్తులెవరు? జాడ తెలుసుకోవాలని.. శ్రీవారి సొమ్ము నొక్కేసిన రవికుమార్ వెనుక ఉన్నది ఎవరో తేల్చాలంటున్నారు భక్తులు..
ఇటు కూటమి ప్రభుత్వం.. అటు వైసీపీ ఆరోపణల మధ్య శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను పక్కదోవ పట్టించిన కేసులో ఏం జరగనుందనేది.. తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..