AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అబార్షన్ పిల్స్ మింగిన 17 ఏళ్ల బాలిక.. మూడో రోజే దారుణం!

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్యుల సూచనలు, పర్యవేక్షణ లేకుండా ఎంటీపీ కిట్ వాడిన 17 ఏళ్ల బాలిక తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. బోయపాలెంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్ కిట్లు విక్రయించిన మెడికల్ షాపులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Andhra Pradesh: అబార్షన్ పిల్స్ మింగిన 17 ఏళ్ల బాలిక.. మూడో రోజే దారుణం!
Abortion Pills
SN Pasha
|

Updated on: Sep 08, 2026 | 7:38 AM

Share

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్యుల సూచనలు, పర్యవేక్షణ లేకుండా అబార్షన్ మాత్రలు తీసుకున్న 17 ఏళ్ల బాలిక తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. ఎడ్లపాడు మండలం బోయపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన బాలిక బోయపాలెంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తోంది. ఆమెకు వివాహం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం సుమారు ఆరు నెలల గర్భంతో ఉన్న ఆమె గర్భాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం వైద్యులను సంప్రదించకుండా స్థానికంగా ఓ మెడికల్ షాపు నుంచి ఎంటీపీ కిట్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇంట్లోనే ఆ మాత్రలను వేసుకున్న అనంతరం మూడో రోజు రాత్రి బాలికకు తీవ్రమైన కడుపునొప్పి, అధిక రక్తస్రావం ప్రారంభమయ్యాయి. పరిస్థితి క్రమంగా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆటోలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. వైద్యులు పరీక్షించి అధిక రక్తస్రావంతో బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు మెడికో-లీగల్ కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బాలికకు అబార్షన్ మాత్రలు ఎక్కడి నుంచి లభించాయి, వాటిని ఎవరు విక్రయించారు అనే కోణంలో విచారణ చేపట్టారు. మెడికల్ షాపు నిర్వాహకుల పాత్రపై కూడా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

అక్రమ విక్రయాలు..

ఆరు నెలల గర్భం ఉన్న సమయంలో వైద్యుల పర్యవేక్షణ లేకుండా అబార్షన్ ప్రయత్నం చేయడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి వెల్లడించింది. ముఖ్యంగా మైనర్‌కు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి మందులు ఎలా విక్రయించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అబార్షన్‌కు సంబంధించిన మందులను వైద్యుల సూచనలతో, తగిన వైద్యపరీక్షలు మరియు పర్యవేక్షణతోనే ఉపయోగించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చుక్కా రత్నం మన్మోహన్ స్పందిస్తూ.. అనుమతి లేకుండా అబార్షన్ కిట్లు విక్రయించడం, అనధికారికంగా గర్భస్రావాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెడికల్ షాపులపై నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

Follow Us