Tirumala: తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, 5 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తర్వాత రోజూ 80వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటుండగా తిరుమలలో భక్తులు రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సర్వదర్శనం భక్తులకు ప్రియారిటి ఇస్తున్న టిటిడి అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. పెరటాసి మాసం, అలాగే రాబోయే వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ గురువారం, అక్టోబర్ 5వ తేదీ సోమవారం ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.
ప్రస్తుతం రోజుకు 80 వేలమందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నా.. భక్తుల రద్దీ తగ్గడం లేదని టిటిడి గుర్తించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల నిరీక్షించే పరిస్థితి ఉందని భావిస్తోంది. దాదాపు 30 వేల మంది భక్తులు తర్వాత రోజు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సామాన్య భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉండే సమయం మరింత పెరుగుతోంది. ఈ కారణంగా అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
బ్రేక్ దర్శనాలు రద్దు..
ఇక విఐపిల సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ ప్రోటోకాల్ విఐపి లకు శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. అక్టోబర్ 1, 5 తేదీలకు సంబంధించి ముందు రోజు అనగా సెప్టెంబర్ 30వ తేది బుధవారం, అక్టోబర్ 4వ తేది ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
