Nuzvidu IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? మూడు రోజుల్లో 800 మంది విద్యార్ధులు ఆస్పత్రిపాలు
ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. మూడు రోజుల వ్యవధిలో వందలాది మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. ఇలా గడిచిన 3 రోజులుగా సుమారు 800 మందికిపైగా విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్ధులంతా..
నూజివీడు, ఆగస్టు 28: ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. మూడు రోజుల వ్యవధిలో వందలాది మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. ఇలా గడిచిన 3 రోజులుగా సుమారు 800 మందికిపైగా విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్ధులంతా ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రస్తుతం వీరందరినీ పలు ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ మెస్‌లలో ఆహారం నాణ్యత సరిగా లేకపోవడం వల్లే విద్యార్ధులు ఇలా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
ఇక్కడి విద్యార్థులు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కొందరు విద్యార్ధులు ఆస్పత్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటూ ఉండగా.. మరికొందరు ఇంజక్షన్లు, మందులు తీసుకుని క్యాంపస్‌లోని వసతి గృహాల్లోనే ఉంటున్నారు. కొంతమంది ఇళ్లకు వెళ్లిపోయారు. మరోవైపు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం 50 నుంచి 60 దాటదని చెబుతున్నారు. ఈ అంశంపై విచారణకు కమిటీ వేశామని అన్నారు. అయితే ముందస్తు చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని, అందువల్లనే అధిక సంఖ్యలో తమ పిల్లలు అనారోత్యం బారిన పడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీ వ్యవహారంపై స్పందించిన మంత్రి నారా లోకేష్
నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త తనను ఆందోళనకు గురిచేసిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తెలియ జేశారు. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను అదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదని.. ఇలాంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందనేది విచారణ కమిటీ సమర్పించే నివేదిక అధారంగా తెలిసే అవకాశం ఉంది.