
Kakinada district: కాకినాడ జిల్లాలో జనావాసాల్లోకి వచ్చిన పులిని బంధించేందుకు లేదా అడవిలోకి తిప్పి పంపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పులి సంచరిస్తున్న ప్రాంతంలో దట్టమైన సరుగుడు తోటలు ఉండటం, మరో వైపు పులి మెరుపులా వచ్చి మాయమవుతుండటంతో దాన్ని పట్టుకోవడం అధికారులకు కష్టసాధ్యంగా మారుతోంది. దీంతో కాకినాడ జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. వారం రోజులుగా వారిని పులి భయభ్రాంతులకు గురిచేస్తోంది. పాదముద్రలు, కదలికలు, వేటాడే తీరును బట్టి ఈ పులి రాయల్ బెంగాల్ జాతికి చెందినది అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. పాదముద్రల ఆధారంగా ఈ పులి రాయల్ బెంగాల్ (royal bengal tiger) జాతికి చెందినదని వయస్సు నాలుగైదేళ్లు ఉంటుందని, బరువు సుమారు 180 కేజీల ఉంటుందన్నది అటవీ అధికారుల అంచనా. దీని పొడవు ఆరున్నర అడుగులు ఉంటుందని భావిస్తున్నారు.
ఏ క్షణాన, ఎక్కడి నుంచి పులి వచ్చి పంజా విసురుతుందో అనే భయం కాకినాడ జిల్లా ప్రజలకు కంటి మీద కనుకులేకుండా చేస్తోంది. ఒమ్మంగి, పోదురుపాక,ఉత్తరకంచి, పాండవులపాలెం చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు ఆందోళనకు గురవుతోంది. పెద్దపులి సంచారంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడప దాటాలన్నా .. గట్టుకి వెళ్లాలన్నా భయంతో హడలిపోతున్నారు. పిల్లా పెద్దలంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. పశువుల్ని కూడా పంటపొలాలకు తీసుకెళ్లేందుకు వెనకాడుతున్నారు.
ఈ ఉదయం మరో ఆవుపై దాడి చేయడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఫారెస్ట్ అధికారులు. చుట్టుపక్కల గ్రామస్తులు చీకటి పడిన తర్వాత బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. పులిని బంధించేందుకు లేదా అడవిలోకి పంపించేందుకు శ్రీశైలం నుంచి మరో టీమ్ రప్పిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి