ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. జీవితాంతం సంతోశంగా ఉందామనుకున్నారు.. అంతలోనే..
విజయనగరం జిల్లా విషాదకర ఘటన వెలుగు చూసింది. పెళ్లై ఏడాది కూడా గడవకముందే నవ దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎప్పుడూ అన్యోన్యంగా ఉండే ఈ దపంతులను ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడం చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దంపతుల మరణాలకు సంబంధిచి కారణాలు తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్నమెరక సమీపంలోని ఓ కాలనీలో నివసిస్తున్న నవ దంపతులు కొప్పుల చిరంజీవి (30), గీతల వెంకటలక్ష్మి (28) అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిద్దరికీ వివాహం జరిగి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అయింది. చిరంజీవి ఒక కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, వెంకటలక్ష్మి సమీపంలోని ఒక దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా ఉద్యోగం చేస్తుంది. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, కుటుంబ సభ్యుల అంగీకారంతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి ఎవరి పనికి వారు వెళ్లే దంపతులు ఈ నెల 23న మాత్రం తెల్లవారిన తరువాత ఎంత సేపు అయినా కనబడకపోవడంతో కిటికీ తలుపు తెరిచి చూశారు స్థానికులు. దీంతో వారికి భయానక ఘటన కనిపించింది. వెంకటలక్ష్మి నేల పై విగతజీవిగా పడి ఉండగా, చిరంజీవి ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను హాస్పటల్ కు తరలించారు. అయితే వారి వద్ద ఎలాంటి ఆయుధాలు కానీ, పెనుగులాడిన ఆనవాళ్లు కానీ కనిపించలేదు. అయితే దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారని ఇటు స్థానికులు, అటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీరిద్దరి మరణం ఆత్మహత్యా లేక హత్యా అనే కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు.
వెంకటలక్ష్మి నేలపై పడి ఉండటం, చిరంజీవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవటం వెనుక అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి, వెంకటలక్ష్మిని హత్య చేసి అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు వెంకటలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అది చూసి తట్టుకోలేక చిరంజీవి కూడా మనస్థాపనతో ఉరేసుకొని మృతి చెందాడా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా దంపతులిద్దరి పోస్టుమార్టం రిపోర్టు తర్వాతే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు పోలీసులు. నవ దంపతుల మరణంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలవిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
