AP News: మహిళకు కలలో కనిపించిన కుంకుళ్ళమ్మ.. తల్లి చెప్పినట్లు పొలానికి వెళ్లి చూడగా

| Edited By: Ram Naramaneni

Dec 02, 2024 | 8:24 PM

పులపర్తి వారి తోట గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం తండోపతండోలుగా వస్తున్నారు. ఆ వింత ఏంటో తెలుసుకుందాం పదండి....

AP News: మహిళకు కలలో కనిపించిన కుంకుళ్ళమ్మ.. తల్లి చెప్పినట్లు పొలానికి వెళ్లి చూడగా
Neem Tree
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయితీ పులపర్తి వారి తోట గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. స్థానిక రైతుకు చెందిన తోటలోని వేప చెట్టు నుంచి పాలు వస్తుండటంతో అక్కడి ప్రజలు ఈ వింతను చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. బ్రహ్మం గారు కాల జ్ఞానం నిజమైంది అంటూ చెట్టు చుట్టూ ముగ్గులు వేసి వేప చెట్టుకు పసుపు కుంకుమలు రాసి దండలు వేసి పూజిస్తున్నారు. వేప చెట్టు తిరుగుతూ తమ గ్రామాన్ని తమను సుభిక్షంగా చూడాలని వేడుకుంటున్నారు. గత మూడు రోజులుగా వేప చెట్టు నుండి పాలు కారుతున్నా ఎవరూ పట్టించుకోలేదని… అమ్మవారు కనిపించి తాను కుంకుళ్ళమ్మ తల్లిని అని వేప చెట్టులో వెలిసినట్లు తెలిపింది అని దీంతో వేప చెట్టులో సాక్షత్తూ కుంకుళ్ళమ్మా వారు వెలసినట్లు తాము భావిస్తున్నామని స్థానిక మహిళలు చెపుతున్నారు. వేప చెట్టు నుంచి పాలు రావడం కుంకుళ్ళమ్మ తల్లి మహిమేనని వారు విశ్వసిస్తున్నారు. వేప చెట్టు నుండి పాలు రావడం నిజంగా ఈ ప్రాంతవాసుల అదృష్టంగా భావిస్తున్నామని స్థానిక మహిళలు చెబుతున్నారు. అమ్మ ఆదేశిస్తే ఆ ప్రాంతంలో గుడి కడతామని స్థానికులు చెబుతున్నారు.

కాగా వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీన్ని అగ్రోబ్యాక్టీరియం ట్యూమెఫేసియన్స్ అంటారు అని తెలిపారు. వేప చెట్టు పెద్దదయ్యాక.. ఎక్కువైన నీటిని కణాల్లో నిల్వ చేసుకోవడం మొదలుపెడుతుందని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై తొర్రల్లా వస్తాయని, వాతావరణంలో తేమ శాతం ఎక్కువైనప్పుడు.. వేప కొమ్మల్లోని ఈ తొర్రలు బలహీనపడి పగుళ్లు రావడం ఫలితంగా అందులో నుంచి పాల లాంటి ద్రవం వస్తుందట. అలా నాలుగు నుంచి ఆరు రోజులపాటు నిరంతరాయంగా ద్రవం బయటకు వస్తుందని బోటనీ ప్రొఫెసర్ గతంలోనే చెప్పారు. ఇది అసాధారణమేమీ కాదని.. 50 ఏళ్లు దాటిన వేప చెట్లలో ఎక్కువగా జరుగుతుందన్నారు.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..