
ఆ ఎద్దులు బరిలో దిగితే బహుమతులే బహుమతులు, ఆరు నెలల కాలంలో 66 పోటీల్లో పాల్గొంటే 62 ప్రథమ బహుమతులు, నాలుగు ద్వితీయ బహుమతులు సాధించాయి. ప్రైజ్ మనీగా ఇప్పటి వరకు రూ.39 లక్షలు, రెండు ద్విచక్ర వాహనాలను గెలుపొందాయి. నంద్యాల జిల్లా పెద్దకొట్టాల గ్రామానికి చెందిన రైతు బోరెడ్డి కేశవరెడ్డికి చెందిన వృషభాలు చూపిస్తున్న ప్రతిభ ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారింది.
నంద్యాల జిల్లా పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డిది వ్యవసాయ కుటుంబ. ఆయనకు వ్యవసాయంతో పాటు ఒంగోలు జాతి వృషభాలను కొనుగోలు చెయ్యడం, ట్రైనింగ్ ఇవ్వడం, పోటీల్లో పాల్గొనడం అంటే మక్కువ. అతనికి ఉన్న మక్కువతో గత సంవత్సరం పల్నాడు జిల్లాలోని ఈర్లపాడు గ్రామంలో రూ.54 లక్షలకు రెండు ఎద్దులను వెచ్చించారు. కొనుగోలు చేసిన రెండు ఎద్దులకు తన ఇష్టమైన బ్రిటిష్ వాళ్ళను ఎదురించిన నంద్యాల ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టగా, మరో వృషబానికి ఇంద్రసేనారెడ్డి పేరు నామకరణం చేశారు.
ఈ రెండు వృషభాలకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్పటిక బెల్లం, కలకండ, ఉలవలు, బార్లి బియ్యం, బళ్ళారి కొబ్బరె నూగులు, వాము, ఓజ కలగలిపి సద్దతో పాటు ఖర్జూరం, అరటిపండ, బాదం, బీన్స్ ఆహారంగా అందిస్తున్నట్లు రైతు కేశవరెడ్డి తెలిపారు. ఇలా ప్రతి రోజు ఆహారం అందిస్తున్నామని దీని కోసం నెలకు రూ.30 వేలకు పైగా ఖర్చు అవుతున్నట్లు చెప్పారు. అంతే కాకుండా రెండు రోజులకు ఒకసారి ఎద్దులకు పోటీలకు సంబందించిన బండలు కట్టి ట్రైనింగ్ కూడా ఇస్తారు.
తాత రామిరెడ్డి తన చిన్నప్పుడు ఇలాగే ఎద్దులకు ట్రైనింగ్ ఇచ్చి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలిచే వాడని అలా వారసత్వంగా తనకు కూడా వ్యవసాయంతో పాటు ఎద్దులకు ట్రైనింగ్ ఇవ్వడం అలవాటు అయిందని చెప్పారు. ఎద్దుల పోటీల్లో పాల్గొని గెలుపొందాలనే మక్కువతో ఇలా ఖరీదును లెక్క చెయ్యకుండా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో యంత్రాల వినియోగం గ్రామస్థాయిలో పెరగడంతో ఎద్దుల సంఖ్య గణనీయంగా తరిగిపోయింది. దాదాపు ఎద్దులు కనుమరుగవుతున్న పరిస్థితులలో 54 లక్షలతో కొనుగోలు చేసి, పెంచి పోటీలలో పాల్గొనేలా చేస్తున్న రైతు కేశవరెడ్డి నిజంగా అభినందనీయుడే.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..