AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: 50 ఏళ్ల శ్యామలమ్మ ఎంత పని చేసింది.. పొలం పనులు చేసే మహేష్‌తో కలిసి..

అన్నమయ్య జిల్లాలో కన్న కొడుకు హత్యకు తల్లి సుపారీ ఇచ్చింది. సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించింది. కొత్తకోటలో ఈ ఘటన జరిగింది. కొడుకును కిరాతకంగా హత్య చేయించిన తల్లితో పాటు 8 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు.

Andhra: 50 ఏళ్ల శ్యామలమ్మ ఎంత పని చేసింది.. పొలం పనులు చేసే మహేష్‌తో కలిసి..
Andhra News
Raju M P R
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 11, 2025 | 7:52 AM

Share

అన్నమయ్య జిల్లాలో కన్నతల్లి హంతకురాలిగా మారింది. బి కొత్తకోటకు చెందిన దాదాపు 50 ఏళ్ల శ్యామలమ్మ ఈ దారుణానికి ఒడిగట్టింది. శ్యామలమ్మతో పాటు హత్యతో సంబంధం ఉన్న మరో 7 మంది నిందితులు అరెస్ట్ కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. కొడుకును హతమార్చేందుకు రూ. 6 లక్షలకు ఒప్పందం ఇచ్చిన తల్లి అడ్వాన్స్‌గా రూ. 50 వేలు కూడా చెల్లించింది. శ్యామలమ్మకు ఇద్దరు కొడుకులు ఉండగా.. పెద్దకొడుకు 22 ఏళ్ల జయప్రకాశ్ రెడ్డి మదనపల్లి సమీపంలోని అంగళ్లులో ఎంబీఏ చదువుతున్నాడు. దురలవాట్లకు బానిసై ఆస్తి కోసం వేధిస్తున్న కొడుకును భరించలేకపోయిన తల్లి శ్యామలమ్మ అంతం చేయాలని నిర్ణయించుకుంది. రెండో కొడుకు విజయవాడలో చదువుతుండగా.. పెద్ద కొడుకును పొలంలో పని చేసే మహేష్ అనే యువకుడితోనే హత్య చేయించేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే కన్న తల్లి శ్యామలమ్మ ఈ దారుణ నిర్ణయాన్ని అమలు చేసింది. ఈ నెల 7న గొళ్లపల్లి వద్ద హత్యకు గురైన జయప్రకాష్ రెడ్డి కేసును చేధించిన పోలీసులు నిప్పులాంటి నిజాలను బయటపెట్టారు.

ఆ ఫోన్ కాలే పట్టించింది..

బి కొత్తకోట మండలం గోళ్ళతోపు పంచాయతీలోని గుడిసివారిపల్లికి చెందిన జయప్రకాశ్ రెడ్డి డెడ్ బాడీ ముంబై- చెన్నై జాతీయ రహదారిపై ఉన్న బ్రాందీ షాప్‌నకు సమీపంలోనే పడి ఉండటంతో హత్యగా గుర్తించి దర్యాప్తు చేపట్టారు. కన్నతల్లి శ్యామలమ్మ మరో వ్యక్తి సాయంతో ఈ హత్య చేయించిందన్న అనుమానంతో పోలీసులు కేసు విచారణ చేసారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలను సేకరించారు. ముందు గుర్తుతెలియని యువకుడి డెడ్ బాడీగా గుర్తించి ఆ తర్వాత జయప్రకాశ్ రెడ్డిగా తేల్చిన పోలీసులు హత్యపై ఆరా తీశారు. మత్తుకు బానిసైన జయప్రకాష్ రెడ్డి హత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే అన్ని కొణాల్లో దర్యాప్తు చేశారు. డెడ్ బాడీ నుంచి వెళ్లిన ఒక్క ఫోన్ కాల్ ఈ కేసులో కీలకంగా మారింది. మహేష్ అనే యువకుడు మొబైల్ నుంచి శ్యామలమ్మకు వెళ్లిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు ఈ కేసును చేధించారు. కొంత టెక్నికల్ ఎవిడెన్స్ లభించడంతో కేసు మిస్టరీని చేధించారు బి.కొత్తకోట పోలీసులు. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన మారణాయుధాలు, వాహనాలను సీజ్ చేసిన పోలీసులు హత్యకు గురైన జయప్రకాశ్ రెడ్డి తల్లితోపాటు మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్‌లో విచారణ చేసారు. దీంతో అన్ని నిజాలు బయటపడ్డాయి.

తల్లి శ్యామలమ్మతో పాటు హత్య చేసేందుకు సుపారీ తీసుకున్న మహేష్ ప్రధాన నిందితుడుగా పోలీసులు తేల్చారు. పెద్దతిప్ప సముద్రంకు చెందిన మహేష్‌ను శ్యామలమ్మ కొడుకు హత్యకు వాడుకుంది. మహేష్‌తో పాటు ములకల చెరువుకు చెందిన భాను ప్రకాష్, సాయి గణేష్, ఆకాష్, కిరణ్, రాహుల్ ప్రమోద్, హరి ప్రసాద్ అనే యువకుల సాయంతో కొడుకును మట్టుబెట్టింది.