శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఘర్షణలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను హిందూపురం(Hindupuram) ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. చిలమత్తూరు మండలంలోని కొడికొండలో ఇటీవల టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడి చేశారు. రెండు రోజుల క్రితం నర్సింహమూర్తి, రవి అనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ(MLA Balakrishna) దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శుక్రవారం బాధితులను పరామర్శించారు. తమ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోమని వైసీపీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలకు కష్టం వస్తే అర్ధరాత్రైనా సరే వస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు కొడికొండలో నాటకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ రాక సందర్భంగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
గ్రామంలోని పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదని, ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయంటూ బాలకృష్ణను ఆపేశారు. ఎక్కువ వాహనాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. బాలకృష్ణ వాహనంతో పాటు మరో మూడు వాహనాలను మాత్రమే గ్రామంలోకి అనుమతించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. గ్రామానికి ఎక్కువ మంది వెళితే మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకొనే అవకాశం ఉందని పోలీసులు ఎమ్మెల్యే బాలకృష్ణకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసుల వివరణకు అంగీకరించిన బాలకృష్ణ.. వారి సూచనల మేరకు టీడీపీ నేతలను పరామర్శించేందుకు వెళ్లారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి