
ఆదివారం రాత్రి సమయంలో గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో కలకలం రేగింది. చాక్లెట్స్ కొనుక్కొని వస్తానని ఇంటిలో నుండి వెళ్లిపోయిన ఏడేళ్ల జై ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని తల్లిలో ఆందోళన మొదలైంది. ఏమైందో తెలియదు గాని జై మాత్రం ఇంటికి రాలేదు. దీంతో ఆమె వెంటనే పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టు పక్కల అంతా వెతికారు. అయినా ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో అందరూ ఒకటే కంగారు పడ్డారు. అయితే కొన్ని గంటల తర్వాత బాలుడిని పోలీసులు క్షేమంగా తల్లి చెంతకు చేర్చడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే…
రాత్రి ఏడు గంటల సమయంలో జై చాక్లెట్స్ కొనుక్కోవడానికి దుకాణంకు వెళ్లాడు. అక్కడ డబ్బులిచ్చి చాక్లెట్స్ కొనుక్కున్నాడు. అయితే ఒకటి బదులు రెండు చాక్లెట్స్ తీసుకున్నాడన్న అనుమానంతో దుకాణం యజమాని జైను మందలించాడు. దొంగతనం చేశావా అంటూ గదమాయించాడు. దీంతో కంగారు పడిన జై ఏడ్చుకుంటూ అక్కడి నుండి వచ్చేశాడు. భయంతో పక్కనే ఉన్న భవనం ఎక్కి దాక్కొన్నాడు. అయితే రాత్రి సమయం కావడంతో ఆ భయంతోనే నిద్రలోకి జారుకున్నాడు. ఈ విషయం తెలియని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం వారు రంగంలోకి దిగడం జరిగిపోయాయి.
చాలా చోట్ల వెదికిన తర్వాత అక్కడున్న భవనంపైకి కూడా పోలీసులకు ఎక్కి పరిశీలించారు. అక్కడ గుర్రు పెట్టి నిద్ర పోతున్న జైని చూశారు. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకొని వాడిని నిద్ర లేపి తీసుకొచ్చి అతని తల్లికి అప్పగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షేమంగా కొడుకు ఇంటికి తిరిగి రావడంతో అతని తల్లి రాణి కళ్లలో అంతులేని ఆనందం కనిపించింది.