Andhra Pradesh: సీఎం జగన్‌ జోక్యం చేసుకున్నా మారని సీన్‌ ..! ‘పిల్లి, వేణు మధ్యలో తోట’.. అసలేం జరుగుతోంది..

Kakinada YSRCP Politics: కోనసీమ జిల్లా రామచంద్రాపురం టిక్కెట్‌ ఫైట్‌ వైసీపీలో హీట్‌ పుట్టిస్తోంది. పిల్లి సుభాష్‌, మంత్రి చెల్లుబోయిన మధ్య ఆధిపత్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. చివరకు సీఎం జోక్యం చేసుకున్నా సీన్‌ సెట్‌ అవలేదు. అలాంటి సమయంలో.. ఇప్పుడు.. తోట త్రిమూర్తులు ఎంట్రీతో రాజకీయం మరింత రంజుగా మారింది.

Andhra Pradesh: సీఎం జగన్‌ జోక్యం చేసుకున్నా మారని సీన్‌ ..! ‘పిల్లి, వేణు మధ్యలో తోట’.. అసలేం జరుగుతోంది..
YS Jagan

Edited By:

Updated on: Jul 25, 2023 | 8:34 AM

Kakinada YSRCP Politics: కోనసీమ జిల్లా రామచంద్రాపురం రాజకీయం గత కొద్దిరోజులుగా ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల వేళ సొంత పార్టీలో అగ్గిరాజుకోవడంతో వైసీపీ రాజకీయం రచ్చ రచ్చగా మారింది. ఒకనాటి గురుశిష్యులు ఇప్పుడు బద్ద శతృవులుగా మారారు. నువ్వా? నేనా? అంటూ సవాళ్ళు, సమావేశాలతో బలప్రదర్శనకు దిగారు. ఇదే ఇప్పుడు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వాస్తవానికి.. రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన వేణు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే.. వేణు సొంత నియోజకవర్గం కాకపోవడంతో ఈసారి సీటు నాదేనంటూ పిల్లి సుభాష్‌ తెగేసి చెప్పారు. ఇస్తే తనకు లేదంటే కుమారుడికి తప్ప మరొకరికి సీటు దక్కేదే లేదంటూ పిల్లి సుభాష్‌ స్పష్టం చేయడంతో ప్రకంపనలు రేగాయి.

ఇక.. పిల్లి సుభాష్‌, మంత్రి చెల్లుబోయిన సీటు ఫైట్‌ తారాస్థాయి చేరి.. సీఎం జగన్ దాకా వెళ్లింది. పిల్లి సుభాష్‌ను సీఎం పిలిచి మాట్లాడినా తీరు మారలేదు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అంతటితో ఆగలేదు.. విషయం కేసుల వరకూ వెళ్ళింది. తన కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని పిల్లి ఆగ్రహించారు.

అయితే.. రామచంద్రాపురం నియోజకవర్గం బాగా బలపడటమే ఆరోపణలకు కారణమన్నారు మంత్రి చెల్లుబోయిన. ఎంపీ మిథున్‌రెడ్డి, తోట త్రిమూర్తులు సమక్షంలోనే 2024లో తానే పోటీ చేయనున్నట్లు సీఎం జగన్‌ చెప్పినట్లు గుర్తు చేశారాయన.

ఇవి కూడా చదవండి

ఇదిలావుంటే.. రామచంద్రపురం వైసీపీలో ఆధిపత్య పోరుపై టీవీ9 వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ సీనియర్‌ నేత తోట త్రిమూర్తులు. 2024, 2029, 2034లో రామచంద్రపురం టికెట్ వేణుకే అని సీఎం జగన్‌ తన సమక్షంలో చెప్పినట్టు ఆయన వెల్లడించడం కరెక్ట్‌ కాదన్నారు.

మొత్తంగా.. కోనసీమ జిల్లా రామచంద్రపురం రాజకీయం వైసీపీలో రచ్చగా మారింది. అయితే.. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వైసీపీ అధిష్టానం.. ఏ ఒక్క నేతను వదులుకోకుండా సెట్‌ చేయాలని చూస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి..

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..