Andhra Pradesh YSRCP: ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బల ప్రదర్శనలు.. పోటాపోటీ సవాళ్లు, ప్రతిసవాళ్లు.. ఇప్పుడు అధికార పార్టీలో ఇదే తంతు జరుగుతోంది. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణు.. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య ఆధిపత్యపోరు పీక్స్‌కి చేరింది. ఇవాళ మంత్రి వేణు వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది. చోడవరం బైపాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో.. మీటింగ్‌కి అన్ని ఏర్పాట్లూ చేశారు. 10 గంటలకు మొదలయ్యే మీటింగ్‌కి నియోజకవర్గంలోని అన్నిగ్రామాల నుంచి పెద్ద ఎత్తున మద్దతుదార్లు రానున్నారు.
ఉన్నట్టుండి ఈ మీటింగ్ ఎందుకు.. మొన్న బోస్ వర్గం మీటింగ్‌కి ఇది కౌంటరా..? పరిస్థితి చూస్తే ఇలాగే కనిపిస్తున్నా, వేణు వర్గం దీనిపై పైకి ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లయిన సందర్భంగానే ఈ ఆత్మీయ సమ్మేళనం అని అంటున్నారు. కారణం 3 ఏళ్లు పూర్తయిన వేడుక అనే చెప్తున్నా.. ఏర్పాట్లు, ఇతరత్రా హంగామా చూస్తుంటే మంత్రి వర్గీయులు తమ బలం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది.
ఉదయం మొదలయ్యే మీటింగ్ మధ్యాహ్నం విందుతో ముగుస్తుంది. ఈ మీటింగ్ ద్వారా ప్రత్యర్థి వర్గానికి మంత్రి వేణు మద్దతుదార్లు ఎలాంటి సంకేతాలు ఇస్తారు.. మొన్నటి విమర్శలకు కౌంటర్ ఇస్తారా.. ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.
అయితే, రామచంద్రపురం టికెట్ విషయంలో మంత్రి వేణు, పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బోస్ కుమారుడు ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఐతే.. అధిష్టానం తనకే హామీ ఇచ్చిందనేది మంత్రి వేణు మాట. ఈ నేపథ్యంలోనే మొన్న విభేదాలు భగ్గుమనడం.. దీనిపై బోస్ తాడేపల్లి వెళ్లి వివరణ ఇవ్వడం కూడా చూశాం. ఇక ఇవాళ్టి మీటింగ్ ద్వారా వేణు వర్గం ఎలాంటి బల ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఈనెల 26న సీఎం అమలాపురం పర్యటనకు వస్తున్నారు. ఇరువర్గాలు ఆ రోజు CM జగన్ ను కలిసి తమ వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..